
'మీ విమానంలోనే ఉగ్రవాదులను తీసుకురండి'
ఝాన్సీ (యూపీ): వచ్చే సంవత్సరం సార్క్ సదస్సుకు పాకిస్థాన్ కు వెళుతున్న భారత్ ప్రధాని నరేంద్రమోదీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన విమానంలోనే ఉగ్రవాదులను స్వదేశానికి తీసుకురావాలని ఉత్తర్ ప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఏవిధంగా ప్రత్యేక విమానంలో దేశం దాటారో.. అదే విధంగా వారందరిని భారత్కు తీసుకు రావాలన్నారు. ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందుకు హాజరైన అనంతరం ఆజం ఖాన్ మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఏడాది సార్క్ సమావేశాలకు మోదీ పాక్కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పాక్లో తలదాచుకుంటున్న భారత మోస్టు వాంటెడ్ ఉగ్రవాదులను తిరిగి భారత్ తీసుకురావాలన్నారు. గత వారం నవాజ్ షరీఫ్ సార్క్ సమావేశాలకు మోదీని ఆహ్వానించగా దానికి ఆయన అంగీకరించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా, 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్లైన్స్ ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసి విమాన సిబ్బందితో పాటూ155 మందిని అఫ్ఘనిస్తాన్లోని ఖాందహార్ తరలించారు. అప్పుడు భారత ప్రభుత్వం వారితో చర్చించి.. బందీగా ఉన్న అత్యంత ప్రమాదకరమైన మౌలానా మసూద్ అజార్తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను విడిచిపెట్టి, ప్రత్యేక విమానంలో దేశం నుంచి పంపించారు. ఈ నేపథ్యంలో ఆజం ఖాన్ పైవిధంగా వ్యాఖ్యానించారు. 26/11 ముంబై దాడిలో ప్రధాన సూత్రదారుడు జాకీర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వల్డ్ డాన్ దావుద్ ఇబ్రహింలను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో పాకిస్తాన్ని కోరుతుంది.