సాక్షి, హైదరాబాద్: ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పడనున్న ఎన్నికలు అధికారపార్టీకి పరీక్ష పెట్టనున్నాయి. ప్రస్తుతం వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా... మరో మూడు ఎన్నికలు ముందున్నాయి. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి పదిహేడు నెలలు గడిచిపోయినందున, ప్రతి ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు, టీఆర్‌ఎస్ పాలనకు రెఫరెండం అంటూ విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ముందున్న ఎన్నికలన్నీ అధికార పార్టీకి ప్రతిష్టాత్మకమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘అయిదేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు ఉండవు. అందరూ రాజకీయాలు వదిలేసి అభివృద్ధి మీద దృష్టిపెడదాం.. బంగారు తెలంగాణ సాధించుకుందాం..’ అని అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
కేసీఆర్ రాజీనామాతో... ఉప ఎన్నికలకు అంకురార్పణ
మెదక్ ఎంపీగా, గజ్వేలు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించిన కేసీఆర్ మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో కొత్త రాష్ట్రంలో ఉప ఎన్నికలకు అంకురార్పణ జరిగింది. ఆ తరువాత ‘ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ’ ఎన్నికలు రాష్ట్ర రాజధానిలో వేడి పుట్టించాయి. అనంతరం ఖాళీ అయిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, అవి ముగిసిన కొన్నాళ్లకే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికలు జరిగాయి.
ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. త్వరలోనే ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. మరో వైపు పెరిగిన స్థానాలకు తోడు ఖాళీ అయిన స్థానాలు కలుపుకొని 12 ‘స్థానిక సంస్థల ’ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. హైదరాబాద్ మినహా, మిగిలిన తొమ్మిది జిల్లాల్లో ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలు వేడి పుట్టించనున్నాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు అధికార పార్టీకి సవాలుగా నిలవనున్నాయి.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డిసెంబరు-జనవరి నెలల్లో జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలూ జరగాల్సి ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో గెలవడం అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక్కో ఎన్నిక టీఆర్‌ఎస్‌కు విషమ పరీక్ష పెట్టేవే అని, ఈ ఫలితాల ఆధారంగానే ప్రభుత్వ తీరును, టీఆర్‌ఎస్ పాలనను బేరీజు వేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.