సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జరిగే భేటీలో ఎన్నికల కమిషన్ (ఈసీ) చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలా లేక మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలా అనే అంశంపై ఈసీ కసరత్తు సాగించనుంది. ఈసీ ప్రతి మంగళవారం, శుక్రవారం సమావేశమయ్యే క్రమంలో తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతర పరిణామాలు,ఎన్నికల నిర్వహణపై నేటి సమావేశంలో చర్చకు రావచ్చని సీనియర్ అధికారి వెల్లడించారు.
తుది నిర్ణయం తీసుకునే ముందు పండుగలు, పరీక్షలు, వాతావరణం వంటి పలు అంశాలను ఈసీ బేరీజు వేస్తుందని చెప్పారు. జూన్ 2019 వరకూ అసెంబ్లీకి గడువున్నాపార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు విముఖత చూపుతూ టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు పూనుకున్నారు. అసెంబ్లీని రద్దు చేస్తూ గురువారం రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు అందచేశారు. అసెంబ్లీ రద్దు తీర్మానానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్ నరసింహన్ తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment