సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. ఇరవై రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. ఇప్పటివరకు నేతల ప్రసంగాలు, ప్రచార వాహనాల సందడిగా కనిపించిన పల్లెలు.. పట్టణాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దవాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం కొలిక్కి వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా బరిలోకి దిగాయి. పొత్తుల ప్రక్రియ ఖరారు కాకముందే హడావుడి చేసిన ఆశావహులు.. చివరకు నామినేషన్ల తర్వాత సర్దుకుపోవడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ప్రచార పర్వాన్ని సాగించి ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయడంలో బిజీ అయ్యాయి.
అధినేతల పర్యటన..
ఎన్నికల బరిలో దిగిన రాజకీయ పార్టీల అభ్యర్థులు వ్యూహాత్మకంగా ప్రచారం చేపట్టారు. పార్టీ అధినేతలను తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తే సత్ఫలితాలు ఉంటాయని భావించిన అభ్యర్థులు.. ఆ విషయంలో విజయవంతమయ్యారు. దాదాపు ప్రధాన రాజకీయ పార్టీ నేతలంతా జిల్లాలో ప్రచారం చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత పర్యటన ఉత్సాహంగా సాగింది. అదేవిధంగా చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేశారు.
తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె .చంద్రశేఖర్‌రావు రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు. మొత్తమ్మీద ఎన్నికల ప్రచారంలోకి అధినేతలను దింపడం కలిసివస్తుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులకు ముచ్చమటలు పట్టించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దఎత్తున డబ్బులు, మద్యాన్ని పంపిణీ చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. సోమవారం సాయంత్రం 6గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ.. అభ్యర్థులు మాత్రం అంతర్గత ప్రచారంలో బిజీ అయ్యారు. ఓటర్లను నేరుగా కలిసి తమను గె లిపించాలంటూ ప్రాథేయపడుతున్నారు. బుధవారం ఉదయం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అప్పటివరకు వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసి ఓట్లు మళ్లించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ష్.. గప్‌చుప్!
Published Mon, Apr 28 2014 11:23 PM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement