హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేకువజాము నుంచే శైవక్షేత్రాలు, నది, సముద్ర తీరాలు భక్తుల కళకళలాడాయి. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతో నిండిపోయాయి.
గోదావరి తీరంలోని ఖమ్మం జిల్లా భద్రాచల క్షేత్రంలో వేకువజామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి తీరానికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు చేసి, శ్రీరాముని సన్నిధిలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం పాతాళగంగ వద్ద రద్దీ పెరిగిపోయింది. మల్లికార్జున స్వామి దర్శనానికి జనం పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత సేవలను రద్దు చేసి, స్వామి వారి అలంకార దర్శన సేవభాగ్యం కల్పించారు.
తిరుపతిలోని కపిలతీర్థంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కపిలతీర్థం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భక్తులను దగ్గరగా అనుమతించటం లేదు. శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.సింహాచల వరాహ నరసింహ స్వామి క్షేత్రం, నల్లగొండ జిల్లా యాదాద్రి, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలు కార్తీక దీపారాధన చేశారు.
గోదావరి, కృష్ణా నదులతోపాటు బాపట్ల సూర్యలంక, ఒంగోలు, విశాఖ కాకినాడ, బందరు సముద్ర తీరాల్లో భక్తులు కార్తీక స్నానాలు చేస్తున్నారు.