నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత
హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని నదులతో పాటు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. జిల్లాలోని తడ మండలం నామర్లమెట్ట కండ్రిగ గ్రామం జలదిగ్బంధమైంది. పాముల కాలువ పొంగి ప్రవహించడంతో గ్రామానికి వెళ్లే రహదరులన్నీ మూసుకు పోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని స్వర్ణముఖి నది, కైవల్యానది ,కాలంగి నదితో పాటు పాముల కాలువ, మామిడి కాలువ పొంగి ప్రవహిస్తున్నాయి. కాలంగి నది పొంగి ప్రవహించడంతో సుమారు 5 గ్రామాలకు రాకపోకలు కూడా స్తంభించాయి. సైదాపురం, గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ద్రోణి ప్రభావంతో ప్రకాశం జిల్లాలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.
నాయుడుపేట మండలంలోని మాబాక గ్రామం నీటమునిగింది. మోకాల్లోతు నీరు రావడంతో గ్రామంలో ఉన్న 100 కుటుంబాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ అధికారులు వాహనాలను సిద్ధం చేశారు. ఐదేళ్ల తర్వాత స్వర్ణముఖి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో నాయుడుపేట పట్టణంలోని బీడీ కాలనీ, లోతువానిగుంట వద్ద నది కట్ట తెగే పరిస్థితి ఏర్పడడంతో అధికారులు ఇసుకబస్తాలను అడ్డుగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. వెంకటగిరి మండలంలో 30 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదైంది. పట్టణం మధ్యలో ఉన్న కైవల్యా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక తడ మండలంలో పాముల కాల్వ పొంగి ప్రవహించడంతో ఎన్‌ఎం కండ్రిగ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
తడ, సూళ్లూరుపేట మండలాల్లో వరద పరిస్థితులపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీ చైర్మన్ రాఘవేందర్‌రెడ్డి, నాయుడుపేట ఆర్డీవో బాబయ్య సమీక్షించారు. భారీ వర్షాలకు జలమయమైన ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను కలుసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను వెంటనే షెల్టర్లకు తరలించాలన్నారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. వర్షానికి రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఘాట్ రోడ్డులోని 16 వ కి. మీ వద్ద బండరాళ్లు భారీగా పడిపోయాయి. పాపవినాశం డ్యాం పూర్తిగా నిండటంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని వదులుతున్నారు. కాలిబాటలో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వాహనాలను లింక్ రోడ్ల మీదుగా తిరుమలకు మళ్లించారు.
మరో వైపు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలవల్ల వరద నీరు ఎక్కువగా చేరడంతో కాలంగి రిజర్వాయర్ గేట్లు కొట్టుకుపోయాయి. వరదనీరు ఎక్కువగా చేరుతుండటంతో ఆదివారమే మూడు గేట్లను మూడు అడుగుల మేర పైకి ఎత్తారు. వరద తాకిడి ఎక్కువై సోమవారం తెల్లవారు జామున గేట్లు కొట్టుకుపోయాయి. దీంతో నీరు వృధాగా పోతుంది. ఈ రిజర్వాయర్ కింద 5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వాయర్‌కు మొత్తం 18 గేట్లు ఉన్నాయి.
పుంగనూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. షిరిడీసాయినగర్, దోబీకాలనీ, ఏటిగడ్డపాలెం, మేలుపట్లలోని రోడ్లు జలమయం కావడంతో మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీల సహాయంతో నీటిని బయటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వైఎస్సాఆర్ కడప: వాయుగుండం కారణంగా కడప జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సుండుపల్లి సమీపంలోని పింఛానదికి వరద నీరు ఎక్కువగా చేరడంతో ఇప్పటికే రెండు గేట్లు ఎత్తివేశారు. సోమవారం ఉదయం 14 వేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఫలితంగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వారం రోజులుగా సుండుపల్లి పరిసర ప్రాంతాల్లోని 25 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఆ గ్రామాలకు రాకపోకలు లేవు. ప్రజలు నానా యాతన పడుతున్నారు.