ఉద్యోగుల విభజన ఇంకెన్నాళ్లు?
అక్టోబర్ 15 లోపు పూర్తికాకపోతే ఢిల్లీలో తేల్చుకుంటాం: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా ఇంకా ఉద్యోగులు, సంస్థల విభజన జరగలేదని.. దాని వల్ల తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడానికి, ఉద్యోగులకు పదోన్నతులు లభించకపోవడానికి ఉద్యోగుల విభజనలో జాప్యమే కారణమన్నారు.
రాష్ట్రస్థాయి అధికారుల విభజన కోసం ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. ఇక పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనలో షీలాబిడే కమిటీ కాలయాపన చేస్తోందన్నారు. ఈ అంశాల జాప్యంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15 నాటికి ఉద్యోగుల విభజన జరగాల్సి ఉండగా... కమిటీలు కాలక్షేపం చేస్తున్నాయన్నారు. గడువులోగా ఉద్యోగుల విభజన జరగకపోతే ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు.
విభజన జరిగిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్‌వోడీలు పాత స్థానాల్లోనే ఉండేందుకు సాకులు వెదుకుతున్నారని, తెలంగాణవారిమని చెప్పుకొనేందుకు దొంగ బోనఫైడ్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారు భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.