మెహిదీపట్నం : పనీపాటా లేకుండా తిరుగుతూ..ఇదేమని అడిగినందుకు భార్యతో పాటు అత్త, మరదలిపై ఓ వ్యక్తి దాడచేశాడు. ఈ ఘటన మెహిదీపట్నం పోచమ్మబస్తీలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బస్తీకి చెందిన శివసాయి స్థానిక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, అతడు జులాయిగా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో భార్య ప్రశ్నించింది. ఆమెపై చేయిచేసుకోవటంతో ఇటీవల స్థానికంగా పంచాయితీ పెట్టారు.
ఆగస్టు 10వ తేదీలోగా అతడు ఏదో ఒక పనిలో కుదురుకోవాలని, ఆ తర్వాతే భార్యను పుట్టింటికి పంపించాలని పెద్దలు నిర్ణయించారు. అయితే, శివసాయి మాత్రం ఆ మాట పట్టించుకోకుండా తరచూ వచ్చి భార్యను వేధిస్తున్నాడు. తాజా గా బుధవారం ఉదయం కూడా భార్య వద్దకు వచ్చి తన వెంట రావాలని కోరాడు. ముందుగా ఏదో ఒక పనిచేయాలని, ఆ తర్వాతే వస్తానని ఆమె చెప్పింది.
దీంతో కోపంతో ఊగిపోయిన శివసాయి ఆమె తలపై రోకలి బండతో కొట్టాడు. అడ్డువచ్చిన అత్త, మరదలిని కూడా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. చుట్టుపక్కల వారు వచ్చే సరికి శివసాయి పరారయ్యాడు. బాధితులు ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.