- నోటిఫికేషన్ జారీ చేయకుండానే..ఔట్‌సోర్సింగ్ టెండర్లలో అవకతవకలు
- ఆదిలాబాద్ బల్దియాలో కీలక నేతల వ్యవహారం ప్రభుత్వ ఆదాయూనికి గండి
ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాల్టీలో ఔట్‌సోర్సింగ్ టెండర్లలో అక్రమాలకు తెరలేచింది. నోటిఫికేషన్ జారీ చేయకుండానే వ్యవహారమంతా చక్కబెట్టడం అనుమానాలకు తావిస్తోంది. బల్దియూలో కీలక నేతలకు ఈ టెండర్ అప్పగించేందుకు అధికారులు నిబంధనలు ఉల్లంఘించారనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. పోటీకి వచ్చిన కొంతమందిని అనర్హులుగా ప్రకటించి కీలక నేతలకే టెండర్ దక్కేలా శక్తియుక్తులు ప్రదర్శించారని తెలుస్తోంది. దీనికి తోడు స్వయంగా మున్సిపల్ అధికారి టెండర్ వేశార ని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మున్సిపాల్టీలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పారిశుధ్య, వాటర్‌సప్లయ్ కార్మికులు, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్ విభాగం, జవాన్ల నియూమకానికి ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించారు. వీటిపై ఓ కీలక నేత కన్ను పడడంతో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారమే షెడ్యూల్ ఫారాలు విక్రయించి అదే రోజు మధ్యాహ్నం వరకు దాఖలు కు నిబంధన విధించడం గమనార్హం. సాయంత్రం టెండర్లు తెరిచారు. కంప్యూటర్ ఆపరేటర్ల నియూమకం మినహాయించి మిగితా విభాగాల నియూమక టెండర్లు నిర్మల్‌కు చెందిన జైభీం ఎస్సీ కో ఆపరేటివ్ సొసైటీకి దక్కినట్లు తెలుస్తోంది.
అంత ఉల్లంఘనే..
టెండర్ నోటిఫికేషన్ నెంబర్ ఈ1/106/109/2014-15 తేదీ 30-06-2015 ప్రకారం మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ 10 యూనిట్ల కోసం నిర్వహించిన టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. నిబంధన ప్రకారం బైభీం సొసైటీ ఎస్సీ కో ఆపరేటివ్ సంస్థ రూ.4 కోట్ల టెండర్లను దక్కించుకుంది. కాగా నిబంధన ప్రకారం ఏపీ సహకార సంఘం 1964 ప్రకారం ఎస్సీ ఎస్టీ బడ్డెర ఎల్‌సీ. కో ఆపరేటివ్ సోసైటీ లిమిటెడ్ రెండు బైలా ప్రకారం సహకార సంఘం డివిజన్ పరిధిలోనే కార్యకలాపాలు జరపాలని స్థానిక సొసైటీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం రూ.50 లక్షల కాంట్రాక్ట్‌లను మాత్రమే ఆ సొసైటీకి ఇవ్వాలి. కానీ రూ.4 కోట్ల కాంట్రాక్టులు అప్పగించారు. సింగిల్ టెండర్లు వేయడం ఈ అక్రమాలకు నిదర్శనం. ప్రతీ టెండరుదారుడికి షెడ్యూల్ ఫారాలు ఇవ్వాలి. కానీ 20 తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఇవ్వలేదు.
టెండర్లు వేయకుండానే తిరస్కరణ..
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పాలకవర్గం ఆడిందే ఆట పా డిందే పాటగా మారింది. టెండర్లు వేసిన తర్వాత తిరస్కరిం చాల్సి ఉండగా.. అధికారులు ముందుగానే తిరస్కరిస్తున్నా రు. టెండర్ దారుడి వద్ద లేబర్ సర్టిఫికేట్, ఐటీ, పాన్‌కార్డు, వ్యాట్, తదితర అన్ని ఉన్నా టెండర్లను తిరస్కరించి అనుకున్న వారికే అప్పగించారు. దీంతో పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు రద్దు చేయాలని దుర్గం సొసైటీ, రాజీవ్‌గాంధీ ఎస్సీ సొసైటీ, అభ్యుదయ ఎస్సీ సొసైటీ, బాబు జగ్జీవన్‌రావు సొసైటీ, వైఎస్సార్ ఎస్సీ సొసైటీ సభ్యులు, నాయకులు మున్సిపల్ కమిషనర్ వెంకటేశంకు వినతిపత్రం అందజేశారు.
మున్సిపల్ ఆదాయానికి గండి..
టెండర్ల నిర్వహణలో మున్సిపల్ ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతోంది. రూ.4 కోట్ల 12 లక్షల 43 వేల టెండర్‌ను సింగిల్ టెండర్లతో జైభీం సొసైటీ, ఇమేజ్ కంప్యూటర్ సొసైటీ దక్కించుకున్నాయి. పోటీ లేకపోవడంతో ఆదాయానికి గండి పడింది.