కాళేశ్వరం బ్యారేజీని మొదలుపెడదాం | Kaleshwaram barrage start | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం బ్యారేజీని మొదలుపెడదాం

Published Sat, Jul 11 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

Kaleshwaram barrage start

సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పులో భాగంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ నిర్మాణ విషయమై స్పష్టత వచ్చినందున ఈ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ముంపు లేకుండా చేపట్టే బ్యారేజీ నిర్మాణాన్ని ఏ ఎత్తులో చేపట్టాలన్న దానిపై ప్రాజెక్టు సర్వే బాధ్యతలు చూస్తున్న వ్యాప్కోస్ సమర్పించిన నివేదిక పూర్తి సంతృప్తికరంగా ఉన్న దృష్ట్యా, దీనిపై శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తుమ్మిడిహెట్టితో పోలిస్తే కాళేశ్వరం దిగువన నీటి ప్రవాహం ఎక్కువ రోజులుంటుందని, లభ్యత సైతం గణనీయంగా ఉందని ఇప్పటికే వ్యాప్కోస్ ప్రాధమికంగా నిర్ధారించింది. ఎలాంటి అంతరాష్ట్ర వివాదాలకు ఆస్కారం లేకుండా ఇక్కడి నుంచి నీర్ణిత నీటిని రాష్ట్రానికి మళ్లించుకోగలిగితే, ఆ తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే ప్రాజెక్టు కింద నిర్ణయించిన సాగు, తాగు నీటి లక్ష్యాలను చేరుకోవచ్చని నివేదించింది. మేటిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తును 102మీటర్ల ఎత్తుతో నిర్మించి 100మీటర్ల వరకే నీటిని నిల్వ చేసి ముంపు లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఈ ఎత్తులో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసే ఆస్కారం ఉండటంతో పాటు సుమారు 120 రోజుల పాటు నీటి లభ్యత ఉంటుందని వ్యాప్కోస్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి వరకు కాల్వల అలైన్‌మెంట్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కాల్వల అలైన్‌మెంట్లలో 22 క్లిష్టమైన పాయింట్లను గుర్తించిన సంస్థ వాటికి ప్రత్యామ్నాయాలపై సర్వే చేస్తోంది. దీంతో పాటే త్వరలోనే ఈ  ప్రాంతంలో లైడార్ సర్వే సైతం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ప్రక్రియంతా జరిగి తుది నివేదిక వచ్చేందుకు మరో రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశాల దృష్ట్యా అప్పటిరవకు బ్యారేజీ నిర్మాణాన్ని ఆరంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. పనులు ఆరంభించడం ద్వారా ప్రాజెక్టును జాప్యం చేస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవాలనే ఉద్ధేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై శనివారం నాటి కేబినెట్ భేటీలో చర్చిస్తారని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement