అధికార ‘కాలవ’లో ఇసుక దందా! | Kapu ramachandra reddy takes on kalva srinivasulu | Sakshi
Sakshi News home page

అధికార ‘కాలవ’లో ఇసుక దందా!

Published Mon, Jul 27 2015 6:16 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

అధికార ‘కాలవ’లో ఇసుక దందా! - Sakshi

అధికార ‘కాలవ’లో ఇసుక దందా!

డ్వాక్రా మహిళల ముసుగులో దోచుకుంటున్న టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్, అనంతపురం టౌన్: తివిరి ఇసుమన (ఇసుక నుంచి) తైలంబు తీయవచ్చునో లేదో గానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం రూ.వేల కోట్లు పిండుకుంటున్నారు. డ్వాక్రా మహిళల ముసుగులో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నా అధికార యంత్రాంగం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు తన అనుచరగణంతో సాగిస్తున్న ఇసుకదందా శనివారం రాత్రి బట్టబయలైంది.

నియోజకవర్గంలో వేదవతి నది, వాగులు, వంకలను గుప్పిట్లోకి తెచ్చుకున్న శ్రీనివాసులు.. తన అనుచరులతో అక్రమంగా ఇసుకను తవ్వేస్తూ కర్ణాటకకు తరలిస్తూ రూ.కోట్లను వెనకేసుకుంటున్నారు. ఈ ఇసుక దందాపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనేకల్లు మండలం రచ్చుమర్రి శివారులోని వేదవతి నదిలో ఇసుకను తవ్వేస్తున్న ఒక జేసీబీ, ఐదు టిప్పర్లు, రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. 15 మంది కాలవ అనుచరులను అరెస్టు చేశారు.

ఈ సమాచారం అందుకున్న కాలవ.. పోలీసులపై కస్సుబుస్సులాడారు. తన అనుచరులను వదిలేసి.. వాహనాలను అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం వారి దోపిడీకి, వంతపాడటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ‘పచ్చదండు’ రెచ్చిపోయి ఇసుక లూటీ కొనసాగిస్తోంది.
 సీసీ కెమెరాలేవీ? : అక్రమాలను నిరోధించడం, పారదర్శకంగా ఇసుక రవాణా సాగేందుకు వీలుగా ప్రతి క్వారీలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడా వాటిని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తమ పార్టీ నేతల దోపిడీకి దన్నుగా ఉండేందుకే వీటిని ఏర్పాటు చేయడంలేదనే విమర్శలున్నాయి.
 
ప్రభుత్వ ఆదాయానికంటే 20 రెట్లు అధికం..

ప్రభుత్వ గణాంకాల ప్రకారం (ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో) ఇప్పటి వరకూ 1.07 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయం ద్వారా రూ.653.25 కోట్ల ఆదాయం వచ్చింది. అధికార పార్టీ నేతలు అక్రమ మార్గాల్లో ఇసుకను తరలించి విక్రయించడం ద్వారా హీనపక్షం రూ.12 వేల కోట్లు కొల్లగొట్టారని అధికార వర్గాలు బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అంటే.. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే కనీసం 20 రెట్లు అధికంగా టీడీపీ నేతలు దండుకున్నట్లు తెలుస్తోంది.
 
అడ్డొస్తే దాడులే...

     
* పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి యత్నించిన తహశీల్దారు వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఆయననే వెనుకేసుకొస్తూ తహశీల్దారు చర్యలను తప్పుబట్టడం, కేబినెట్ వంతపాడటం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.
* తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు నేతృత్వంలో సాగుతున్న ఇసుక దందాను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై టీడీపీ కార్యకర్తలు ఏకంగా దాడికి పాల్పడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉన్నతస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుండిపోయారు.
* తాజాగా.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం రచ్చుమర్రిలో వేదవతి నదిలో ఇసుకను తవ్వుతున్నారని వైస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కణేకల్లు ఇన్‌ఛార్జి ఎస్.ఐ. శేఖర్ తన సిబ్బందితో ఇసుక క్వారీలో దాడులు నిర్వహించి అయిదు టిప్పర్లు, రెండు లారీలు, ఒక జేసీబీని సీజ్ చేసి 15 మందిని అరెస్టు చేశారు. ఇది తెలిసిన  చీఫ్ విప్ కాలువ ఆగ్రహోదగ్రుడయ్యారు. వాహనాలను, అరెస్టు చేసిన వారిని వదిలేయాలంటూ పోలీసు అధికారులకు హుకుం జారీ చేశారు.
 
దోపిడీకి సాక్ష్యాలివీ...

* శ్రీకాకుళంజిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధి సోదరుడు నాగావళి నదిలో అనధికారికంగా ఇసుక రీచ్‌లను నిర్వహిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రేయింబవళ్లు  లారీలు, టిప్పర్లతో ఇసుకను విశాఖపట్నానికి తరలిస్తున్నారు. రోజుకు హీనపక్షం రూ.20 లక్షలకు ఆర్జిస్తున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించిన ఓ తహశీల్దారును కీలక ప్రజాప్రతినిధి తీవ్రస్థాయిలో బెదిరించారు.
* తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో యనమల కృష్ణుడు నేతృత్వంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇసుకను కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్‌లకు తరలిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
* పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక మాఫియాకు నేతృత్వం వహిస్తున్నారు. జిల్లాలో మెజారిటీ ఇసుక క్వారీలను బినామీ పేర్లతో నిర్వహిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు.
* కృష్ణా జిల్లాలో చంద్రబాబుకు సన్నిహితుడైన ఒక మంత్రి ఇసుక మాఫియాకు దిశానిర్దేశం చేస్తూ పర్సంటేజిలు తీసుకుంటున్నారు. ఆయన మాట వేదంగా సాగుతోంది.
* గుంటూరు జిల్లాలో స్వయంగా ఒక మంత్రి ఇసుకాసురుడిగా మారిపోయారు. పేరు డ్వాక్రా సంఘాలదైనా పెత్తనం, నిర్వహణ మొత్తం మంత్రి, ఆయన భార్యదే.
* కర్నూలు జిల్లాలో కీలక ప్రజాప్రతినిధి సోదరులు నిత్యం వందలాది లారీల ఇసుకను బెంగళూరు, హైదరాబాద్‌లకు తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు.
* అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని వేదవతి నదిని ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు చెరబట్టారు. తన అనుచరగణంతో అడ్డగోలుగా రేయింబవుళ్లు ఇసుకను తవ్వించి బళ్లారికి తరలించి సూట్ కేసులు నింపుకుంటున్నారు. ఇదే జిల్లాలో ‘బ్రదర్స్’గా ప్రసిద్ధికెక్కిన ప్రజాప్రతినిధులు పెన్నానదిని గుండుగుత్తగా కబ్జా చేసేశారు. పొక్లెయిన్లతో తవ్వి రాత్రింబవుళ్లు క్వారీల వద్దే క్యూబిక్ మీటరు రూ.3,500 నుంచి రూ.4,000 ధరతో విక్రయిస్తున్నారు.
* చిత్తూరు జిల్లా సీఎం నియోజకవర్గం కుప్పంలో పాలారు నదిని టీడీపీ నేతలు ఆక్రమించి అడ్డగోలుగా ఇసుక తవ్వి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
 
మహిళా సాధికారత పేరుతో..
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత పేరుతో ఇసుక క్వారీలను డ్వాక్రా మహిళా సంఘాలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. 356 ఇసుక క్వారీలను అధికారికంగా లీజుకిచ్చినట్లు ప్రకటించింది. అనధికారింగా వెయ్యికిపైగా క్వారీల్లో టీడీపీ నేతలు తవ్వకాలు సాగిస్తూ లూటీ చేస్తున్నారు. పర్మిట్లు లేకుండా, రాయల్టీ చెల్లించకుండా ఇసుక తరలించి విక్రయించడం ద్వారా రూ.వేలకోట్లు కొల్లగొడుతున్నారు.

డ్వాక్రా మహిళల పేరిట లీజుకిచ్చిన 356  ఇసుక క్వారీల్లోనూ 90  శాతం టీడీపీ ప్రజాప్రతినిధుల చేతిలోనే ఉన్నాయి. ఒకే పర్మిట్‌పై 30కిపైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించి క్యూబిక్ మీటరు రూ.3,500 నుంచి రూ.4,000 వరకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement