గుడిసెల జోలికొస్తే రోడ్డుకీడుస్తాం
సాక్షి, హైదరాబాద్: గుడిసెల్లో ఉంటున్న పేదలకు పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాలకు పాల్పడుతోందని వివిధ పక్షాలు నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలు, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల పరిధిలో గుడిసెల తొలగింపును వెంటనే నిలిపివేయాలని, అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో గుడిసెలను తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన ‘‘పేదల గుడిసెల తొలగింపు-టీఆర్‌ఎస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి’’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
గుడిసెలు తొలగింపునకు గురైన కొమురంభీమ్‌నగర్ పేదలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గుడిసెలను నిర్దాక్షిణ్యంగా తొలగించిన సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ పార్టీని రోడ్డు మీదకు ఈడుస్తామని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. కబ్జాకు గురైన భూములను తాము చూపుతామని, వాటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటే పేదలకు ఒకటి కాదు మూడు పడక గదులు కట్టించి ఇవ్వొచ్చునన్నారు. గుడిసెల తొలగింపునకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలసి పోరాడుతామని, పేదల గుడిసెలను తొలగిస్తున్న ప్రభుత్వానికి మానవత్వం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
పేదలకు రెండు పడకగదుల ఇళ్లు కట్టిస్తామని ఒకవైపు చెబుతూ మరోవైపు గుడిసెలు తొలగించడం కేసీఆర్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిదర్శనమన్నారు. గృహ నిర్మాణం కోసం రెండు బడ్జెట్‌లలో రూ.వెయ్యి కోట్ల చొప్పున కేటాయించిన ప్రభుత్వం అందుల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. ఒక్క గుడిసె జోలికి వచ్చినా సీఎం కేసీఆర్‌ను క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు పంపిస్తామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ హెచ్చరించారు. ఒక్క గుడిసెను తొలగించినా ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు.
గుడిసె వాసుల కోసం వామపక్షాలు చేపట్టే పోరాటాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కొమురంభీమ్ నగర్ గుడిసెవాసులతో పాటు రాష్ట్రంలోని గుడిసెవాసులందరికీ జీవో 59 ప్రకారం చట్టబద్ధంగా పట్టాలు పొందే హక్కు ఉందని సీపీఎంనేత తమ్మినేని వీరభద్రం అన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజీవ్‌గృహకల్పలో దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడిని తెచ్చేందుకు వామపక్షాలు, ఇతరపార్టీలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామన్నారు. ఈ భేటీకి శ్రీధర్‌రెడ్డి (బీజేపీ), కె.గోవర్దన్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న), ఝాన్సీ (న్యూడెమోక్రసీ-రాయల), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), వీరయ్య ( సీపీఐ-ఎంఎల్) తదితరులు పాల్గొన్నారు.