తమ చెరలో ఉన్న ఇస్సాక్‌ను విడుదల చేయాలంటే అతని తండ్రి పాస్టర్ కన్నయ్య తమ వద్దకు రావాల్సిందేనని మావోయిస్టులు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఇస్సాక్ ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి మావోయిస్టుల చేతిలో బందీలైన పాస్టర్లను ఆదివారం రాత్రి మావోయిస్టులు విడిచిపెట్టారు. అయితే చెర వీడిన పాస్టర్లు అటవీ ప్రాంతంలో అసలేం జరిగిందనే దానిపై నోరు మెదపడం లేదు.
ఇస్సాక్ ఆచూకీ కోసం వెళ్లినపుడు మావోయిస్టులు ఎలా తారసపడ్డారు, ఏం మాట్లాడారు, ఇస్సాక్‌ను చూపించారా, ఎలాంటి హెచ్చరికలు చేశారనే దానిపై వారు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే, తాము ముందు నుంచీ బందీ చేసిన ఇస్సాక్‌ను, పాస్టర్లను మావోయిస్టులు విడివిడిగా ఉంచినట్లు తెలిసింది.
కాగా, కన్నయ్య వచ్చిన తర్వాత అతనితో మాట్లాడిన అనంతరం కొడుకుని విడుదల చేస్తామని, మరోసారి ఇస్సాక్‌విడుదల కోసం ఎవరూ మధ్యవర్తులుగా రావద్దని మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఇస్సాక్ భవితవ్యం ఇక అతని తండ్రిపైనే ఆధారపడి నట్లయింది.
ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. మరోవైపు మావోయిస్టులు కన్నయ్యకు అల్టిమేటం జారీచేస్తూ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇస్సాక్‌ను అపహరించిన నాటి నుంచి కన్నయ్య ఆచూకీ లేకపోవడంతో మావోయిస్టులు లేఖలో ఏం రాశారనేది స్పష్టంగా తెలియరాలేదు.
'తండ్రి వస్తేనే కొడుకును వదులుతాం..'
Published Mon, Nov 9 2015 7:09 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement