'మోదీ అవినీతి రక్షకుడు'
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతిపరుడని, ఆయన అవినీతిని రక్షిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు డా. ఎన్ రఘువీరా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు సూర్యానాయక్, ప్రధాన కార్యదర్శులు జంగా గౌతమ్, రవిచంద్రారెడ్డి, లీగల్ సెల్ చైర్మన్ సుందర రామశర్మలతో కలిసి మాట్లాడిన ఆయన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వెనుక భారీ కుంభకోణం ఉందన్నారు.
దీనిపై పార్లమెంటులో చర్చ జరిగితే మోదీ నేరుగా జైలుకు వెళ్లాల్సివస్తుందని చెప్పారు. అవినీతి బయటపడుతుందనే కారణంగానే మోదీ పార్లమెంటును సజావుగా సాగనివ్వడం లేదని అన్నారు. కార్పోరేట్ శక్తులకు సర్వీసు చార్జీల పేరిట ఏడాదికి రూ.1.50లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని మోదీ అందిస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రధానమంత్రి కావడానికి బీజేపీ వేలాది కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేసిందని.. ఈ సొమ్ము మొత్తం కార్పొరేట్ శక్తులే వారికి అందించాయో లేదో మోదీనే సమాధానం చెప్పాలని అన్నారు.