పంచదార ఎగుమతులు పెంచాలి: ప్రధాని
న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల అధికంగా ఉన్న పంచదార నిల్వలను వినియోగించటం కోసం.. ఎగుమతులను పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. చెరకు రంగ అంశాలపై సమీక్షించేందుకు ప్రధాని శనివారం మంత్రులు, అధికారులతో భేటీ నిర్వహించారు. దేశంలో పంచదార సరఫరాకు - డిమాండ్‌కు మధ్య తేడాను పరిగణనలోకి తీసుకుంటూ.. పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలపటం పెంచాలని మోదీ పిలుపునిచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. పంచదార మిగులు ఉత్పత్తి వల్ల దేశీయ మార్కెట్‌లో పంచదార ధర తగ్గిందని.. ఫలితంగా పంచదార పరిశ్రమ రైతులకు రూ. 14,398 కోట్ల మేర బకాయిపడిందని వివరించింది. మంత్రులు రాధామోహన్, పాశ్వాన్, నిర్మలాసీతారామన్ తదితరులు భేటీలో పాల్గొన్నారు.