sugar price
-
భారీగా నష్టపోతున్న చక్కెర షేర్లు
ముంబై: కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగమతులపై 20 శాతం సుంకం విధించడంతో చక్కెర షేర్ల ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. శుక్రవారం నాటి మార్కెట్లో సుగర్ సెక్టార్ భారీగా నష్టాలను చవిచూస్తోంది. దాదాపు అన్ని చక్కెర షేర్లు 2 నుంచి 10 శాతం పడిపోయి..నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ హిందుస్తాన్ అయిదుశాతం, ఓధ్ సుగర్ 8 శాతం నష్టాలను మూట గట్టుకుంది. వీటితోపాటుగా శ్రీ రేణుకా సుగర్ 4శాతం, బలరాంపూర్ చినీ 3 శాతం, పొన్ని సుగర్స్ 10 శాతం నష్టాలతో ఇదే బాటలో నడుస్తున్నాయి. అయితే ఎగుమతులపై సుంకంతో దేశీయ ధరలకు చెక్ చెప్పే అవకాశం లేదని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశీయ ధరలపై ప్రభావం చూపదన్నారు శక్తి సుగర్స్ ఎండీ ఎం మణిక్కం.భారతదేశం నుంచి సాధారణంగా సుగర్ ఎగుమతులు పెద్దగా ఉండవని, మిగులు ఉన్నపుడు మాత్రమే ఎగుమతిచేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేజీకి రూ. 40 వద్దనున్న చక్కెర ధరను అదుపుచేసేందుకు, దేశీయ సరఫరాల్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) నోటీఫై చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ధరలుపెరగడంతో ఎగుమతులు పరిమితం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ తరువాత ఇండియాది రెండవ స్థానం. -
చక్కెరపై 20 శాతం ఎగుమతి సుంకం
న్యూఢిల్లీ: ప్రస్తుతం కేజీకి రూ. 40 వద్దనున్న చక్కెర ధరను అదుపుచేసేందుకు, దేశీయ సరఫరాల్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) నోటీఫై చేసినట్లు ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఆరు నెలల క్రితం రూ. 30 వద్దనున్న చక్కెర ధరలు అమాంతం రూ. 40 వరకూ పెరిగాయి. -
పంచదార ఎగుమతులు పెంచాలి: ప్రధాని
న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల అధికంగా ఉన్న పంచదార నిల్వలను వినియోగించటం కోసం.. ఎగుమతులను పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. చెరకు రంగ అంశాలపై సమీక్షించేందుకు ప్రధాని శనివారం మంత్రులు, అధికారులతో భేటీ నిర్వహించారు. దేశంలో పంచదార సరఫరాకు - డిమాండ్‌కు మధ్య తేడాను పరిగణనలోకి తీసుకుంటూ.. పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలపటం పెంచాలని మోదీ పిలుపునిచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. పంచదార మిగులు ఉత్పత్తి వల్ల దేశీయ మార్కెట్లో పంచదార ధర తగ్గిందని.. ఫలితంగా పంచదార పరిశ్రమ రైతులకు రూ. 14,398 కోట్ల మేర బకాయిపడిందని వివరించింది. మంత్రులు రాధామోహన్, పాశ్వాన్, నిర్మలాసీతారామన్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. -
చక్కెర బస్తాపై రూ.1,500 నష్టం..
♦ ఏడాదిలో రూ.1,100 పతనమైన ధర ♦ మిల్లు వద్ద క్వింటాలుకు రూ.1,900 ♦ తయారీ వ్యయం రూ.3,400 ♦ ఫ్యాక్టరీలను నడపలేమంటున్న కంపెనీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చక్కెర ధర కనీవినీ ఎరుగని రీతిలో పతనమవుతోంది. మిల్లు ధర క్వింటాలుకు మంగళవారం రూ.1,900 లకు దిగి వచ్చింది. ఏడాదిలో ధర రూ.1,100 పడింది. గతేడాది క్వింటాలు ధర రూ.3,000 లకు అటూఇటుగా నమోదైంది. సామాన్యులకు తీపిని పంచుతున్నా కంపెనీలు మాత్రం కోలుకోలేని షాక్‌లో ఉన్నాయి. క్లిష్టమైన తయారీ విధానం అయినప్పటికీ ధర పెరక్కపోవడంతో గత ఆరేడేళ్లుగా కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుత ం ఒక్కో బస్తాకు తయారీ వ్యయం రూ.3,400 అవుతోంది. దీంతో రూ.1,500 నష్టం వస్తోంది. దేశవ్యాప్తంగా నిర్వహణలో ఉన్న 500 లకుపైగా కంపెనీల్లో లాభాలను ఆర్జిస్తున్న కంపెనీల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టగలిగే స్థాయికి వచ్చాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే చక్కెర సీజన్లో (అక్టోబర్ 2015- సెప్టెంబర్ 2016) ఫ్యాక్టరీలను నడపలేమని చాలా కంపెనీలు ప్రభుత్వానికి విన్నవించాయి. చక్కెర నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే దీనికి కారణం. ప్రభుత్వ విధానపర నిర్ణయాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని కంపెనీలు అంటున్నాయి. వినియోగానికి మించి.. దేశవ్యాప్తంగా చక్కెర ఉత్పత్తి గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో (అక్టో బర్ 2014-సెప్టెంబరు 2015) 240 లక్షల టన్నుల చక్కెర డిమాండ్ ఉంది. ఉత్పత్తి మాత్రం 285 లక్షల టన్నులకు చేరనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో ముఖ్య విషయమేమంటే ఓపెనింగ్ స్టాక్ (నిల్వ) 2015 అక్టోబర్ 1 నాటికి 100 లక్ష టన్నులు ఉండనుంది. పోనీ ఎగుమతులు చేద్దామన్నా అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి ఉంది. పలు దేశాల్లో చక్కెర ఉత్పత్తి అంచనాల కంటే ఎక్కువైంది. ఇక దేశీయంగా రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు రూ.22,000 కోట్లున్నాయని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సీవోవో జి.వెంకటేశ్వరరావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. తమ కంపెనీ మాత్రం రైతులకు పూర్తిగా చెల్లించిందన్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న తమ కంపెనీకి చెందిన 2 ప్లాంట్లకుగాను రూ.35 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. అమ్మకం ధర కంటే.. చక్కెర అమ్మకం ధర కంటే తయారీ వ్యయమే అధికంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 100 కిలోల చక్కెర బస్తా ధర మిల్లు వద్ద అటూఇటుగా రూ.1,900 ఉంది. తయారీ వ్యయం రూ.3,400 అవుతోందని కేసీపీ చెబుతోంది. అటు వాణిజ్యపరంగా చక్కెర వినియోగం సైతం దేశంలో పెద్దగా పెరగడం లేదు. అయితే వ్యాట్, ఎగ్జిట్ ట్యాక్స్ ఎత్తివేయాలని పరిశ్రమ చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పొరుగు రాష్ట్రాలకు చక్కెర ఎగుమతి చేస్తే కేంద్ర అమ్మకం పన్ను విధిస్తున్నారు. మొలాసిస్‌ను పక్క రాష్ట్రానికి విక్రయించాలంటే ఎగ్జిట్ ట్యాక్స్ టన్నుకు రూ.2,500 చెల్లించాల్సి వస్తోంది. ఇవన్నీ పరిశ్రమకు భారమేనని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీ తెలిపారు. దేశవ్యాప్తంగా చెరకు ధర ఒకేలా ఉండాలి. చెరకు ధరను, చక్కెర ధరతో ముడి పెట్టాలి అని అన్నారు. కాగా, హోల్‌సేల్‌లో తగ్గినా రిటైల్‌లో మాత్రం ధరలు దిగిరావడం లేదు. రిటైల్ మార్కెట్లో కిలో చక్కెర ధర రకాన్ని బట్టి రూ.28-35 మధ్య ఉంది. -
చక్కెర మిల్లుల చేదు గీతం
=తగ్గిపోతున్న పంచదార ధరలు =అమ్మితే రూ.12 కోట్లు నష్టం =ఆందోళన చెందుతున్న యాజమాన్యాలు ={పభుత్వాల విధానాలతో ఆర్థిక సంక్షోభం చోడవరం,న్యూస్‌లైన్: చక్కెర పరిశ్రమ సంక్షోభం దిశగా పయనిస్తోందా..? అంటే అవుననే చెబుతున్నాయి మిల్లుల యాజమాన్యాలు. మార్కెట్లో పంచదార ధరలు నాలుగు నెలలుగా తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. ధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసిన ఫ్యాక్టరీలకు నష్టాల బారిన పడే ప్రమాదం దాపురించింది. మునుపెన్నడూలేని విధంగా ఈ ఏడాది మొలాసిస్ ధరలు ఆశాజనకంగా ఉండి కొంత ఆదుకున్నప్పటికీ, చక్కెర ధర మాత్రం ఆందోళన కలిగిస్తోంది. నాలుగు నెలల్లో క్వింటా పంచదార ధర రూ.3150లు నుంచి రూ.2875లకు పడిపోయింది. జూన్ నెల నుంచి తగ్గుతూ వస్తున్న ధరలతో ఇలా క్వింటాకు రూ.245లు ఫ్యాక్టరీలు కోల్పోతున్నాయి. ప్రస్తుతం గోవాడ ఫ్యాక్టరీలో 2.4 లక్షలు, తాండవ వద్ద లక్ష , ఏటికొప్పాక వద్ద 1.2 లక్షల టన్నుల పంచదార నిల్వ ఉంది. ఇప్పటికిప్పుడు ప్రస్తుత ధరకు అమ్ముకుంటే జిల్లాలోని ఫ్యాక్టరీలు సుమారు రూ.12 కోట్లు కోల్పోవలసి వస్తుంది. బీట్‌రూట్‌వంటి పంటల ద్వారా ఉత్పత్తయ్యే చక్కెర ధర, చెరకు నుంచి ఉత్పత్తి అవుతున్న ధర ఒకటే కావడంతో ఫ్యాక్టరీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. టన్ను చెరకుకు రూ.1800 నుంచి రూ. 2300 వరకు మిల్లులు రైతుకు చెల్లిస్తున్నాయి. సరాసరి రికవరీ 10శాతం ఉంటే క్వింటా పంచదార ఉత్పత్తికి రూ.2800 నుంచి రూ.3100 వరకు ఫ్యాక్టరీలకు ఖర్చవుతోంది. సీజనంతా కలుపుకుంటే పాత మిషనరీ కారణంగా సరాసరి రికవరీ 10శాతం ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో చక్కెర ధర తగ్గిపోవడం ఫ్యాక్టరీలకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు చౌకదుకాణాల్లో పంపిణీకి సేకరిస్తున్న ధర విషయంలో ప్రభుత్వం ఉదాసీనత కూడా ఫ్యాక్టరీలకు నష్టాన్ని తెచ్చిపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పంచదార క్వింటాకు రూ.3200లు రాష్ట్రప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఈ ధరే ఫ్యాక్టరీలకు చెల్లిస్తే బాగుండేది. కానీ ప్రజాపంపిణీకి సరకులు సరఫరా చేసే పెద్ద వ్యాపారులు రింగయిపోయి ఫ్యాక్టరీల నుంచి క్వింటా పంచదార కేవలం రూ.2900లకే కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాపారులతో కుమ్మక్కయి అదనంగా ప్రభుత్వం ఖర్చుచేయాల్సిన దిగుమతి సుంకం, ఇతర ఖర్చులను మిగిల్చుకునేందుకు వ్యాపారులు నిర్ణయించిన ధరకే ఇవ్వాలంటూ ఫ్యాక్టరీలపై ఒత్తిడి తెస్తోంది. ఈ పరిణామం రాష్ట్రీయ చక్కెర అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు క్రషింగ్‌కు సిద్ధమవుతున్నాయి. పాత నిల్వల అమ్మకాలు పూర్తికాకపోవడంతో,కొత్త పంచదార ఉత్పత్తి అయితే ఎక్కడ నిల్వ చేయాలో తెలియని పరిస్థితితో యాజమాన్యాలు కొట్టుమిట్టాడుతున్నాయి. గోవాడ ఫ్యాక్టరీ గతేడాది ప్రకటించిన ధర కంటే అదనంగా టన్నుకు రూ.300బోనస్ ఇస్తుండటంతో రూ.15కోట్ల అదనపు భారం పడింది. ఒక పక్క ధర పడిపోవడం, మరో పక్క అదనపు భారంతో యాజమాన్యం ఆయోమయానికి గురవుతోంది. ఇక నష్టాల్లో ఉన్న తాండవ, అనకాపల్లి తోపాటు లాభనష్టాలు లేకుండా నడుస్తున్న ఏటికొప్పాకపైనా ధర ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో విదేశీ, ఇతర రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతులపై కేంద్రప్రభుత్వం ఆంక్షలతో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.