చక్కెర బస్తాపై రూ.1,500 నష్టం..
♦ ఏడాదిలో రూ.1,100 పతనమైన ధర
♦ మిల్లు వద్ద క్వింటాలుకు రూ.1,900
♦ తయారీ వ్యయం రూ.3,400
♦ ఫ్యాక్టరీలను నడపలేమంటున్న కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చక్కెర ధర కనీవినీ ఎరుగని రీతిలో పతనమవుతోంది. మిల్లు ధర క్వింటాలుకు మంగళవారం రూ.1,900 లకు దిగి వచ్చింది. ఏడాదిలో ధర రూ.1,100 పడింది. గతేడాది క్వింటాలు ధర రూ.3,000 లకు అటూఇటుగా నమోదైంది. సామాన్యులకు తీపిని పంచుతున్నా కంపెనీలు మాత్రం కోలుకోలేని షాక్‌లో ఉన్నాయి. క్లిష్టమైన తయారీ విధానం అయినప్పటికీ ధర పెరక్కపోవడంతో గత ఆరేడేళ్లుగా కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుత ం ఒక్కో బస్తాకు తయారీ వ్యయం రూ.3,400 అవుతోంది. దీంతో రూ.1,500 నష్టం వస్తోంది.
దేశవ్యాప్తంగా నిర్వహణలో ఉన్న 500 లకుపైగా కంపెనీల్లో లాభాలను ఆర్జిస్తున్న కంపెనీల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టగలిగే స్థాయికి వచ్చాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే చక్కెర సీజన్‌లో (అక్టోబర్ 2015- సెప్టెంబర్ 2016) ఫ్యాక్టరీలను నడపలేమని చాలా కంపెనీలు ప్రభుత్వానికి విన్నవించాయి. చక్కెర నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే దీనికి కారణం. ప్రభుత్వ విధానపర నిర్ణయాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని కంపెనీలు అంటున్నాయి.
వినియోగానికి మించి..
దేశవ్యాప్తంగా చక్కెర ఉత్పత్తి గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వాస్తవానికి ప్రస్తుత సీజన్‌లో (అక్టో బర్ 2014-సెప్టెంబరు 2015) 240 లక్షల టన్నుల చక్కెర డిమాండ్ ఉంది. ఉత్పత్తి మాత్రం 285 లక్షల టన్నులకు చేరనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో ముఖ్య విషయమేమంటే ఓపెనింగ్ స్టాక్ (నిల్వ) 2015 అక్టోబర్ 1 నాటికి 100 లక్ష టన్నులు ఉండనుంది. పోనీ ఎగుమతులు చేద్దామన్నా అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి ఉంది. పలు దేశాల్లో చక్కెర ఉత్పత్తి అంచనాల కంటే ఎక్కువైంది. ఇక దేశీయంగా రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు రూ.22,000 కోట్లున్నాయని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సీవోవో జి.వెంకటేశ్వరరావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. తమ కంపెనీ మాత్రం రైతులకు పూర్తిగా చెల్లించిందన్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న తమ కంపెనీకి చెందిన 2 ప్లాంట్లకుగాను రూ.35 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.
అమ్మకం ధర కంటే..
చక్కెర అమ్మకం ధర కంటే తయారీ వ్యయమే అధికంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 100 కిలోల చక్కెర బస్తా ధర మిల్లు వద్ద అటూఇటుగా రూ.1,900 ఉంది. తయారీ వ్యయం రూ.3,400 అవుతోందని కేసీపీ చెబుతోంది. అటు వాణిజ్యపరంగా చక్కెర వినియోగం సైతం దేశంలో పెద్దగా పెరగడం లేదు. అయితే వ్యాట్, ఎగ్జిట్ ట్యాక్స్ ఎత్తివేయాలని పరిశ్రమ చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పొరుగు రాష్ట్రాలకు చక్కెర ఎగుమతి చేస్తే కేంద్ర అమ్మకం పన్ను విధిస్తున్నారు.
మొలాసిస్‌ను పక్క రాష్ట్రానికి విక్రయించాలంటే ఎగ్జిట్ ట్యాక్స్ టన్నుకు రూ.2,500 చెల్లించాల్సి వస్తోంది. ఇవన్నీ పరిశ్రమకు భారమేనని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీ తెలిపారు. దేశవ్యాప్తంగా చెరకు ధర ఒకేలా ఉండాలి. చెరకు ధరను, చక్కెర ధరతో ముడి పెట్టాలి అని అన్నారు. కాగా, హోల్‌సేల్‌లో తగ్గినా రిటైల్‌లో మాత్రం ధరలు దిగిరావడం లేదు. రిటైల్ మార్కెట్లో కిలో చక్కెర ధర రకాన్ని బట్టి రూ.28-35 మధ్య ఉంది.