చక్కెర మిల్లుల చేదు గీతం | Declining sugar prices | Sakshi
Sakshi News home page

చక్కెర మిల్లుల చేదు గీతం

Published Fri, Oct 18 2013 1:53 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Declining sugar prices


 
=తగ్గిపోతున్న పంచదార ధరలు
=అమ్మితే రూ.12 కోట్లు నష్టం
=ఆందోళన చెందుతున్న యాజమాన్యాలు
={పభుత్వాల విధానాలతో ఆర్థిక సంక్షోభం
 
చోడవరం,న్యూస్‌లైన్: చక్కెర పరిశ్రమ సంక్షోభం దిశగా పయనిస్తోందా..? అంటే అవుననే చెబుతున్నాయి మిల్లుల యాజమాన్యాలు.  మార్కెట్‌లో పంచదార ధరలు నాలుగు నెలలుగా తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. ధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసిన ఫ్యాక్టరీలకు నష్టాల బారిన పడే ప్రమాదం దాపురించింది. మునుపెన్నడూలేని విధంగా ఈ ఏడాది మొలాసిస్ ధరలు ఆశాజనకంగా ఉండి   కొంత ఆదుకున్నప్పటికీ, చక్కెర ధర మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

నాలుగు నెలల్లో క్వింటా పంచదార ధర రూ.3150లు నుంచి  రూ.2875లకు పడిపోయింది. జూన్ నెల నుంచి తగ్గుతూ వస్తున్న ధరలతో ఇలా క్వింటాకు రూ.245లు ఫ్యాక్టరీలు కోల్పోతున్నాయి. ప్రస్తుతం గోవాడ ఫ్యాక్టరీలో 2.4 లక్షలు, తాండవ వద్ద లక్ష , ఏటికొప్పాక వద్ద 1.2 లక్షల టన్నుల పంచదార నిల్వ ఉంది. ఇప్పటికిప్పుడు ప్రస్తుత ధరకు అమ్ముకుంటే జిల్లాలోని ఫ్యాక్టరీలు సుమారు రూ.12 కోట్లు కోల్పోవలసి వస్తుంది. బీట్‌రూట్‌వంటి పంటల ద్వారా ఉత్పత్తయ్యే చక్కెర ధర, చెరకు నుంచి ఉత్పత్తి అవుతున్న ధర ఒకటే కావడంతో ఫ్యాక్టరీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

టన్ను చెరకుకు రూ.1800 నుంచి రూ. 2300 వరకు మిల్లులు రైతుకు చెల్లిస్తున్నాయి. సరాసరి రికవరీ 10శాతం ఉంటే  క్వింటా పంచదార ఉత్పత్తికి రూ.2800 నుంచి రూ.3100 వరకు ఫ్యాక్టరీలకు ఖర్చవుతోంది. సీజనంతా కలుపుకుంటే పాత మిషనరీ కారణంగా సరాసరి రికవరీ 10శాతం ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో చక్కెర ధర తగ్గిపోవడం ఫ్యాక్టరీలకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు చౌకదుకాణాల్లో పంపిణీకి సేకరిస్తున్న ధర విషయంలో ప్రభుత్వం ఉదాసీనత కూడా ఫ్యాక్టరీలకు నష్టాన్ని తెచ్చిపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పంచదార క్వింటాకు రూ.3200లు రాష్ట్రప్రభుత్వానికి చెల్లిస్తుంది.

ఈ ధరే ఫ్యాక్టరీలకు చెల్లిస్తే బాగుండేది. కానీ ప్రజాపంపిణీకి సరకులు సరఫరా చేసే పెద్ద వ్యాపారులు రింగయిపోయి ఫ్యాక్టరీల నుంచి క్వింటా పంచదార కేవలం రూ.2900లకే కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాపారులతో కుమ్మక్కయి అదనంగా ప్రభుత్వం ఖర్చుచేయాల్సిన దిగుమతి సుంకం, ఇతర ఖర్చులను మిగిల్చుకునేందుకు వ్యాపారులు నిర్ణయించిన ధరకే ఇవ్వాలంటూ ఫ్యాక్టరీలపై ఒత్తిడి తెస్తోంది. ఈ పరిణామం రాష్ట్రీయ చక్కెర అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  

జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు క్రషింగ్‌కు సిద్ధమవుతున్నాయి. పాత నిల్వల అమ్మకాలు పూర్తికాకపోవడంతో,కొత్త పంచదార ఉత్పత్తి అయితే ఎక్కడ నిల్వ చేయాలో తెలియని పరిస్థితితో యాజమాన్యాలు కొట్టుమిట్టాడుతున్నాయి. గోవాడ ఫ్యాక్టరీ గతేడాది ప్రకటించిన ధర కంటే అదనంగా టన్నుకు రూ.300బోనస్ ఇస్తుండటంతో రూ.15కోట్ల అదనపు భారం పడింది.

ఒక పక్క ధర పడిపోవడం, మరో పక్క అదనపు భారంతో యాజమాన్యం ఆయోమయానికి గురవుతోంది. ఇక నష్టాల్లో ఉన్న తాండవ, అనకాపల్లి తోపాటు లాభనష్టాలు లేకుండా నడుస్తున్న ఏటికొప్పాకపైనా ధర ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో విదేశీ, ఇతర రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతులపై కేంద్రప్రభుత్వం ఆంక్షలతో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement