ముస్లింలపై లోతైన అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధిత స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి, తెలంగాణ ముస్లింలకు అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణలోని ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ పనితీరు, కార్యాచరణపై సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిపారు.
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కేంద్రం నియమించిన కుంద్ కమిటీ సభ్యులు అమీరుల్లాఖాన్, ప్రొఫెసర్ అబ్దుల్ షాబాన్, తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ చైర్మన్ జి.సుధీర్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన సచార్ కమిటీ, కుంద్ కమిటీలు, మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన రహమాన్ కమిటీ ఎలా అధ్యయనం చేసింది... దానికి అనుసరించిన పద్ధతులను గురించి సమీక్షలో చర్చించారు. తెలంగాణలో అధ్యయనం ఎలా జరగాలో సీఎం ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.
లోతుగా అధ్యయనం జరగాలి
దేశవ్యాప్తంగా జరిగిన సర్వేల కంటే మరింత లోతుగా, శాస్త్రీయంగా తెలంగాణలో ముస్లింలపై అధ్యయనం జరగాలని సీఎం సూచించారు. ప్రతి జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో పర్యటించి పట్టణ గ్రామీణ ముస్లింలను కలవాలన్నారు. వారి స్థితిగతులపై వివరాలు సేకరించటంతో పాటు జీవన విధానంపై ఫొటోలు, వీడియోలు తీయాలన్నారు. ఏజెన్సీలలో కూడా సర్వే జరపాలన్నారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు, ముస్లిం సమాజాల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. అధ్యయనం తర్వాతే ముస్లింల కోసం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించాలన్నారు.
తెలంగాణలో దాదాపు 12 శాతం ముస్లింలున్నారని, వారిలో ఎక్కువ శాతం నిరుపేదలే అని సీఎం చెప్పారు. కనీసం నెలకు రూ.1,000 కూడా సంపాదన లేని వారుండటం బాధాకరమన్నారు. ఎన్నికల సందర్భంగా ముస్లింల జీవన స్థితిగతుల్లో మార్పు తెస్తామని హామీ ఇచ్చామని, వాటిని వందకు వంద శాతం అమలు చేస్తామని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు పెంచటంతో పాటు షాదీ ముబారక్, హాస్టళ్లు, నివాసగృహాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నామన్నారు. జనాభా ప్రకారం పేద ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అవలంబించిన పద్ధతులను అనుసరిస్తామన్నారు. కమిషన్ ఆఫ్‌ఎంక్వైరీస్ నివేదిక రాగానే ముస్లింలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని వెల్లడించారు.
కమిషన్‌లో మరో ఇద్దరు
కుంద్ కమిటీలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి అమీరుల్లాఖాన్, అబ్దుల్ షాబాన్‌లను జి.సుధీర్ నేతృత్వంలోని కమిషన్‌లో సభ్యులుగా నియమించారు. షాబాన్ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన రహమాన్ కమిటీ సభ్యుడు. పూర్తిస్థాయి కమిషన్ ఏర్పాటు జరిగినందున ఆగస్టు మొదటివారంలో సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందిం చుకోవాలని సీఎం సూచించారు.