Telangana Muslims
-
అవయవదానంపై ముస్లింల నిరాసక్తత
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జీవన్ దాన్' స్కీమ్ తెలంగాణలో విజయంసాధించినంతగా మరెక్కడా సాధించలేదు. అవయవదానం కోసం ప్రత్యకంగా తెచ్చిన ఈ స్కీమ్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన 241 మంది వ్యక్తులు తమ అవయవాలను సేకరించి 1,000మందికి ప్రాణదానం చేశారు. అయితే అవయవదానం ఆవశ్యకతను ముస్లింలకు తెలియపర్చడంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమైందని తాజాగా వెల్లడయింది. ముస్లిం కుటుంబాలకు చెందిన చాలా మంది అవయవదానానికి సరేమీరా అంటున్నారు. వీరిలో గ్రహీతల కుటుంబాలు కూడా ఉండటం గమనార్హం. 2013లో ప్రారంభమైన జీవన్ దాన్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకూ 39మంది ముస్లింలు అవయదానాన్ని పొందారు. కానీ దానం చేసుందుకు మాత్రం ఒక్కరూ ముందుకు రాలేదని జీవన్ దాన్ కో-ఆర్డినేటర్ డా.జీ స్వర్ణలత చెప్పారు. ఈ విషయంలో ముస్లిం మత పెద్దల సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మైనారిటీలు నడుపుతున్న రెండు ఆసుపత్రులు జీవన్ దాన్ లో చేరేందుకు నిరాసక్తతను ప్రదర్శించాయని, ఆ రెండు ఆసుపత్రుల్లో 2,849 మందికి అవయవాల అవసరం ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించే విషయమని, మతపరమైన అడ్డంకుల వల్లే ముస్లింలు అవయవదానాలకు ముందుకు రాకపోవడానికి గల కారణం అయిఉండొచ్చని డాక్టర్ స్వర్ణలత అంటున్నారు. -
ముస్లింలపై లోతైన అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధిత స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి, తెలంగాణ ముస్లింలకు అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణలోని ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ పనితీరు, కార్యాచరణపై సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కేంద్రం నియమించిన కుంద్ కమిటీ సభ్యులు అమీరుల్లాఖాన్, ప్రొఫెసర్ అబ్దుల్ షాబాన్, తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ చైర్మన్ జి.సుధీర్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన సచార్ కమిటీ, కుంద్ కమిటీలు, మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన రహమాన్ కమిటీ ఎలా అధ్యయనం చేసింది... దానికి అనుసరించిన పద్ధతులను గురించి సమీక్షలో చర్చించారు. తెలంగాణలో అధ్యయనం ఎలా జరగాలో సీఎం ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. లోతుగా అధ్యయనం జరగాలి దేశవ్యాప్తంగా జరిగిన సర్వేల కంటే మరింత లోతుగా, శాస్త్రీయంగా తెలంగాణలో ముస్లింలపై అధ్యయనం జరగాలని సీఎం సూచించారు. ప్రతి జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో పర్యటించి పట్టణ గ్రామీణ ముస్లింలను కలవాలన్నారు. వారి స్థితిగతులపై వివరాలు సేకరించటంతో పాటు జీవన విధానంపై ఫొటోలు, వీడియోలు తీయాలన్నారు. ఏజెన్సీలలో కూడా సర్వే జరపాలన్నారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు, ముస్లిం సమాజాల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. అధ్యయనం తర్వాతే ముస్లింల కోసం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించాలన్నారు. తెలంగాణలో దాదాపు 12 శాతం ముస్లింలున్నారని, వారిలో ఎక్కువ శాతం నిరుపేదలే అని సీఎం చెప్పారు. కనీసం నెలకు రూ.1,000 కూడా సంపాదన లేని వారుండటం బాధాకరమన్నారు. ఎన్నికల సందర్భంగా ముస్లింల జీవన స్థితిగతుల్లో మార్పు తెస్తామని హామీ ఇచ్చామని, వాటిని వందకు వంద శాతం అమలు చేస్తామని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు పెంచటంతో పాటు షాదీ ముబారక్, హాస్టళ్లు, నివాసగృహాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నామన్నారు. జనాభా ప్రకారం పేద ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అవలంబించిన పద్ధతులను అనుసరిస్తామన్నారు. కమిషన్ ఆఫ్ఎంక్వైరీస్ నివేదిక రాగానే ముస్లింలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని వెల్లడించారు. కమిషన్‌లో మరో ఇద్దరు కుంద్ కమిటీలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి అమీరుల్లాఖాన్, అబ్దుల్ షాబాన్‌లను జి.సుధీర్ నేతృత్వంలోని కమిషన్‌లో సభ్యులుగా నియమించారు. షాబాన్ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన రహమాన్ కమిటీ సభ్యుడు. పూర్తిస్థాయి కమిషన్ ఏర్పాటు జరిగినందున ఆగస్టు మొదటివారంలో సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందిం చుకోవాలని సీఎం సూచించారు. -
పాలకులకు ప్రజల సవాళ్లు
రాష్ట్రం ఎందుకు చీలిందని ఆలోచించడంలో తప్పు లేదు. కానీ గతంలోనే మునిగి తేలుతూ భవితను ఆహ్వానించలేక పోవడం అవివేకం. ముందున్న పెను సవాళ్లను ఎదుర్కోవాలంటే రెండు ప్రభుత్వాలూ కేంద్రంతో కలసి పోరాడి తెలుగు రాష్ట్రాలకు న్యాయంగా రావలసిన నిధులను, అభివృద్ధి ఫలాల వాటాల కోసం సమష్టిగా కృషి చేయాలి. సొంత అస్థిత్వం కోసం, స్వయం పాలన కోసం పోరాడిన తెలంగాణ జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అంతేకాదు అధికార వికేంద్రీకరణ జరిగి, ప్రజలకు పాలన చేరువయ్యేలా ఆంధ్రప్రదేశ్ కూడా మళ్లీ పుట్టింది. ఇది విచ్ఛిన్నం కాదు. వికేంద్రీకరణ. పేర్లు, పాలనాపరమైన సరిహద్దులలో మార్పే తప్ప అవే ప్రాంతాలు అదే ప్రజలు. అవే అధికారాలు, విధానాలు, చట్టాలు, కోర్టులు. ఎదురు నిలిచిన సమస్యల్లోనూ... వాటి పరిష్కారాల్లోనూ సైతం మార్పు లేదు. తనదైన గుర్తింపు కోసం, స్వయం పాలన కోసం, సంస్కృతి పరిర క్షణ కోసం పరితపించిన తెలంగాణ... తన నేల మీద ప్రవహించే నదులు ఇక్కడి పొలాలకు కూడా పారాలని పోరిన తెలంగాణ, ప్రాణాలర్పించిన తెలంగాణ... నేడు తనదైన అస్థిత్వంతో సాక్షాత్కరించింది. ‘‘తీగలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అని నాటి మేటి కవి దాశరథి ఆవేదన చెందిన నాటి నుంచి నేటి దాకా తెలంగాణ పోరాట బాటనే సాగింది. శాతవాహనులు, కాకతీయుల కాలం నాటి తెలుగుగడ్డ తెలంగాణ వైభవం కనుమరుగైంది. స్థానిక వనరులపై, సంపదలపై కన్నే తప్ప ప్రజల జీవన ప్రమాణాలను, నాణ్యతను పెంపొందింపజేయాలన్నే ధ్యాసే లేని పాలకుల పాలనలో పడి నలిగిపోయింది. అన్యాయమైపోయింది. ఐక్యత-విభజన ఓరుగల్లు(వరంగల్లు) రాజధానిగా కాకతీయ సామ్రాజ్యం 1083 నుంచి 1323 వరకు తెలంగాణగా పేరు మోసిన తెలుగు నేలపై విలసిల్లింది. ప్రతాపరుద్రుడు నిజంగానే శత్రువుల పాలిటి రుద్రుడు. 1303లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనలను ఓడించిన ఖ్యాతి ఆయనది. దండయాత్రలను ఎదుర్కొంటూ ప్రతాపరుద్రుడు స్వాతంత్య్రాన్ని కాపాడుకున్నాడు. చివరికి ఉలఘ్ ఖాన్ భారీ సేనలతో ఓరుగల్లు కోటను స్వాధీనం చేసుకోగలిగాడు. ఢిల్లీకి యుద్ధ ఖైదీగా తలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మ బలిదానం చేశాడు. కాకతీయుల ఆ స్వతంత్రేచ్ఛ తెలంగాణ గాలిలో, నేలలో సజీవంగా నిలిచిపోయింది. అటుతర్వాత తెలంగాణ ముస్లిం రాజుల ఏలుబడిలో గోల్కొండ రాజ్యం, ఆ తదుపరి హైదరాబాద్ రాజ్యం అనిపించుకుంది. హైదరాబాద్ రాజ్యాన్ని 1520 నుంచి 1687 మధ్య కుతుబ్ షాహీలు పాలించగా, 1724 నుంచి 1948 దాకా నిజాం నవాబులే ఏలారు. బ్రిటిష్ పాలనలో కోస్తా, రాయలసీమలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండగా తెలంగాణ ప్రజలు నిజాం నవాబుల పాలనలో పలు విధాలుగా అణచివేతకు, వే ధింపులకు గురయ్యారు. రెండొందల ఏళ్ల క్రితం నిజాం నవాబు ఆంగ్ల పాలకులకు సమర్పించుకోవడానికి ముందు, నేటి మచిలీపట్నం (బందరు రేవు), గుంటూరు జిల్లాలు నిజాం హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేవి. వందలాది గ్రామాలను జమీందార్లకు అప్పగించి పాలనను సైతం నిజాం వారికే వదిలేశాడు. దీంతో తెలంగాణ జమీందార్ల దోపిడీకి గురైంది. గడీల గండాలను ఎదుర్కొంది. ఆ దారుణాల నుంచే తెలంగాణ సాయుధ పోరాటం పుట్టింది. నిజాం సేనలు, రజాకార్ మూకల దౌర్జన్యాలను, దారుణాలను తట్టుకొలేక రైతులు బందూకులు పట్టారు. దొరలను కూల్చారు. భూమి కోసం భుక్తికోసం పోరారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడివడిన ఆంధ్ర రాష్ట్రాన్నీ, హైదరాబాద్ సంస్థానంలోంచి మారాఠీ, కన్నడ ప్రాంతాలు విడిపోగా మిగిలిన తెలంగాణ జిల్లాలనూ కలిపి తెలుగు మాట్లాడే వారందరికీ ఒక రాష్ట్రం కావాలనే వాదన మొదలైంది. తెలంగాణ ప్రజల నుంచి ఈ ప్రతిపాదనకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు దేశ సమగ్రతకు సహకరించబోదని బీఆర్ అంబేద్కర్ సైతం విమర్శించారు. జస్టిస్ ఫజల్ అలీ కమిటీ సైతం భాష ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అంగీకరించ లేదు. తెలంగాణా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసింది. కొత్త రాష్ట్రం పేరును ఆంధ్ర తెలంగాణగా తొలుత నిర్ణయించారు. బిల్లులో కూడా అదే ప్రతిపాదించి చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్‌గా మార్చి తెలంగాణను కనుమరుగు చేశారు. అలా 1956లో తెలంగాణ, ఆంధ్ర ప్రజల సమష్టి జీవనం మొదలైంది. పాలకుల ప్రయోజనాలే పరమావధి కాగా, వారి నాగరికత, అవసరాలు, స్వార్థాలు, పరిమితులు, పక్షపాతాలకు లోబడి తెలంగాణ జిల్లాల అభివృద్ధి వెనుకపట్టు పట్టింది. తెలంగాణ పేరు పలకనైనా పలకరాదనే నిషేధాలకు, తెలంగాణకు ఒక్క పైసా ఇచ్చేదిలేద నే ముఖ్యమంత్రి ప్రకటనలకు శాసనసభ వేదికగా మారగా... సమైక్యత అర్థం పర్థంలేని నినాదంగా, శుష్క వాగ్దానంగా మిగలక తప్పలేదు. తెలుగువారి నిజమైన ఐక్యత అక్కడే అంతమైంది. ముందు నిలిచిన సవాళ్లు తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా ఆవిర్భవించిన సందర్భంగా ఆంధ్ర ప్రాంతీయులైనా, రాయలసీమ వాసులైనా, తెలంగాణ వారైనా కోరేది ఒక్కటే... మంచి భవిష్యత్తు. రాష్ట్రం ఎందుకు చీలింది? సమైక్యత ఎందుకు భగ్నమైంది? అని ఆలోచించడంలో తప్పు లేదు. కానీ గతంలోనే మునిగి తేలుతూ ముందు నిలిచిన భవితను ఆహ్వానించలేకపోవడం అవివేకం, అర్థరహితం. లాభ నష్టాల బేరీజులు ఇప్పుడు అప్రస్తుతం. ప్రగతి దారులను అన్వేషిస్తూ ముందుకు సాగడమే విజ్ఞత, తక్షణ అవసరం. విభజన, సమైక్యంగానే కొనసాగడం అనే రెండు భిన్నాభిప్రాయాల మధ్య సాగాల్సిన తీవ్ర సంఘర్షణ సాగింది. తెలంగాణకు స్థానం లేని సమైక్యవాదం నిలవలేకపోయింది. తెలంగాణ విభజనను కోరింది. అది జరిగింది కూడా. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఎవరు? నవ తెలంగాణను అభివృద్ధి పథాన నడిపే వారు ఎవరు?అనేదే తెలంగాణ ఎన్నికల్లో కీలకాంశాలు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు అభివృద్ధినే కీలకాంశంగా భావించారని రెండుచోట్లా అధికారంలోకి వచ్చిన పార్టీలు గమనించవలసి ఉంది. ఏది అభివృద్ధి? అభివృద్ధిని వృద్ధి రేట్లతోనో, రోడ్ల పొడవుతోనో, స్టాక్ మార్కెట్ సూచీలతోనో కొలవడం కాదు. జన జీవనాన్ని ఏ విధంగా మెరుగు పరుస్తారనేదే అసలు సవాలు. సామాన్యుడు బతకగలిగేలా ధరలను ఎలా తగ్గించగలరనేదే సవాలు. ప్రకృతి వనరులను రేపటి తరాలకు మిగల్చకుండా అతిగా వాడి వాయు, జల, భూ కాలుష్యాన్ని పెంచే కంపెనీల లాభాలను పెంచుతారా? లేక పర్యావరణాన్ని పరిరక్షిస్తారా? అనేదే సవాలు. రెండు రాష్ట్రాలు స్థానికంగా ఉపాధిని కల్పించగలుగుతాయా? లేక విద్యావంతులు, కూలీలు వేరే రాష్ట్రాలకు దేశాలకు తరలిపోవాల్సి వస్తుందా? ఇవే మన ముందున్న అసలు సవాళ్లు. కేంద్రం నుండి ఎన్ని వేల కోట్ల నిధులు సంపాదించారనే దాని కంటే సామాన్యుని కుటుంబం ఎంత ఖర్చుతో బతకగలుగుతోందనే వాస్తవికాంశమే ప్రాధాన్యంగలదనే అంశాన్ని రెండు రాష్ట్రాల పాలకులు గుర్తించారా? జిల్లాకో విమానాశ్రయం కన్నా నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పన అతి ముఖ్యమైనదని అర్థమవుతోందా? ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చే దుర్మార్గం ఆపి, ప్రైవేటు వ్యక్తులకు ధారాదాత్తం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తీసుకుంటారా? లేదా? అని తెలంగాణ, ఏపీ సర్కార్లను ప్రశ్నిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ కోసం శాంతియుతంగా న్యాయమైన చర్యలు తీసుకుంటారా? లేదా? అని నిలదీస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల ద్వేషాలు రగిల్చి, లాభాలను ప్రైవేటు కంపెనీలకు తరలించే దుర్మార్గాలను ఏ విధంగా ఆపుతారు? కృష్ణా-గోదావరి బేసిన్లో సహజ వాయు నిక్షేపాలను ఆ నదులు పారే తెలుగు రాష్ట్రాలకు కాక మరేదో కంపెనీకి అప్పగించడమే దేశభక్తి అవుతుందా? ఈ వాయు నిక్షేపాల వెలికితీత వల్ల కోస్తా ప్రకృతి వైపరీత్యాలకు గురి కాకుండా ఎవరు కాపాడతారనేదే అసలు సిసలు ప్రశ్న. వాయు తరంగాలు, భూమిలోని ఖనిజ సంపదలు, నదులు, సముద్ర తీరాల్లోని చమురు సహజవాయువులు సహా సకల సంపద జాతికంతటికీ చెందుతాయని ఆ జాతిలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉంటాయని గుర్తిస్తారా లేదా? అటు భారత జాతికి ఇటు తెలుగు ప్రజలకు కాకుండా ఈ సంపదను మరెవరికో కట్టబెట్టకూడద ని, మరెవరికో తరలించ కూడదని గ్రహిస్తారా? లేదా? అన్నదే అసలు సిసలు ప్రశ్న. నదీ జలాల పంపకం వివాదాల కంటే తీవ్రమైన ఈ జాతీయ సమస్యను పట్టించుకుంటారా? ఈ సవాళ్లను ప్రజా పక్షంగా పరిష్కరించాలంటే రెండు రాష్ట్రాలూ కేంద్రంతో పోరాడి న్యాయంగా తెలుగు రాష్ట్రాలకు రావలసిన నిధులను, అభివృద్ధి ఫలాల వాటాలను రాబట్టడం కోసం సమష్టిగా కృషి చేయాలి. అప్పుడే తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా ఉన్నా ఒక్కటిగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు కళ్లు తెరిచారు తెలంగాణా ఉద్యమం తెలుగు వారందరిలోనూ రాజకీయ సామాజిక చైతన్యాన్ని పెంచింది. తెలుగు ఓటర్లు ఇప్పుడు ఏమీ తెలియని అమాయకులు కారు. వారు లేవనెత్తే ఈ సవాళ్లను స్వీకరించి పాలకులు ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చడం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-బీజేపీ ప్రభుత్వానికి నైతిక బాధ్యత, రాజ్యాంగ విధి. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలను ఒక రిపైకి ఒకరిని ఉసిగొలిపే ధోరణిని, స్వార్థ ప్రయోజనాలను వీడి వాగ్దానాలను అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావడం రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల రాజకీయ కర్తవ్యం. అది ప్రజా మాధ్యమాల మీద, చైతన్యవంతులైన ప్రజలందరి మీద కూడా ఉన్న బాధ్యత, ప్రజా తీర్పును శిరసావహించి ఫిరాయింపులను ప్రోత్సహించక పోవడం అధికార పార్టీల కనీస ధర్మం. ఓటర్లు మద్యం, డబ్బు, దుష్ర్పచారాలు, దూషణల వల్ల ప్రభావితమైనా కాకున్నా తమ ఓటుతో ఎన్నికైన ప్రభుత్వాలు తమకు చేసిన వాగ్దానాలను అమలు చేసేలా చూడటంలో నిరంతరం అప్రమత్తంగా ఉండడం వారి ధర్మం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహోదరభావం, సామరస్యాలు వెల్లివిరుస్తాయని, విడిగా ఉన్నా ప్రగతి పథంలో కలిసి సాగుతామని తెలుగుజాతి ఆకాంక్షిస్తోంది. దాన్ని శిరసావహించడమే పాలకుల కర్తవ్యం. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) - ప్రొ. మాడభూషి శ్రీథర్ -
ప్రాతినిధ్యం పెరగాలి.. ముస్లింలకు పాకిస్తాన్
* తెలంగాణ ముస్లింల డిమాండ్ * ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలి తెలంగాణలో ముస్లింల స్థితిగతులు, సామాజికంగా, రాజకీయంగా వారికున్న అవకాశాలు, ఆకాంక్షలు తదితరాలపై మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో జేఎన్‌యూ సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి ఒక సర్వే నిర్వహించారు. ముస్లిం సంస్థల నేతలతోపాటు లాయర్లు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, జర్నలిస్టులు, వ్యాపారులు, మధ్య తరగతికి చెందిన వారు... ఇలా అన్ని రంగాలకు చెందిన ముస్లింల నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించారు. దాని ముఖ్యాంశాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ముస్లింల జనాభా 12.5 శాతం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయి మెరుగవుతుందా? లేక ఇంకా దిగజారుతుందా? ఇది ప్రస్తుతం కీల కాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ముస్లింల అభిప్రాయం ఏమిటి? తెలంగాణ ఉద్యమంలో వారు చురుగ్గా పాల్గొన్నారా? తటస్థంగా ఉన్నారా? లేక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారా? ఉద్యమ సమయంలో తెలంగాణలో మత ప్రాతిపదికన చీలిక ఏర్పడిందా? లేక మరింత లౌకికత్వాన్ని సంతరించుకుందా? ‘సామాజిక తెలంగాణ’లో ముస్లింలకు స్థానముందా? తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం ల ప్రాబల్యం పెరుగుతుందని హిందువులు భయపడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో జరిపిన ఒక సర్వేలో కొన్ని వాస్తవాలు వెల్లడయ్యాయి. వాటి వివరాలు... మా సీట్లు మాకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత కేంద్రీకృత ముస్లిం జనాభా కారణంగా హిందూ ముస్లింల మధ్య చీలిక మరింత ప్రస్ఫుటమయింది. ప్రత్యేక రాష్ట్రంలో ముస్లింలు కోరుకుంటున్న సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను, రాజకీయ ప్రాతినిధ్యాన్ని హిందువులు దురాక్రమణపూరిత వైఖరిగా భావిస్తున్నారు. తమ వర్గం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ రాజకీయ ప్రాతినిధ్యం పెరగడమొక్కటే పరిష్కారమని ముస్లింలు భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. తమ జనాభా అధికంగా ఉన్న చోట పార్టీలు తమకే టికెట్లు కేటాయించాలని ముస్లింలు కోరుతున్నారు. తద్వారా ఆ స్థానాల్లో తమ అభ్యర్థినే గెలిపించుకుని చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలో ముస్లింలున్నారు. అయితే, దీన్ని మతం ప్రాతిపదికన ఓట్లను సమీకరించడంగా, ఓటుబ్యాంకు రాజకీయంగా హిందువులు భావిస్తున్నారు. నిజాం అనంతరం పేదరికంలోకి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం చెందిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా, నిజాం రాజును కర్కోటకుడిగా బీజేపీ పేర్కొంటోంది. దీన్ని తెలంగాణ లోని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఆసుపత్రి సహా ఎన్నో నిర్మాణాలు నిజాంల హయాంలోనే జరిగాయని, ఎంతోమంది హిందువులకు భూములనిచ్చి నిజాం వారిని దేశ్‌ముఖ్‌లను చేశారని వారు వాదిస్తున్నారు. ఏ రాజైనా భూస్వామ్య మనస్తత్వమే కలిగి ఉంటాడని, ముస్లిం కావడం వల్లనే నిజాం రాజును నియంతగా ప్రచారం చేస్తున్నారన్నది వారి వాదన. నిజాం పాలన తరువాత ఉర్దూను అధికార భాషగా తొలగించడం వల్ల ఆధునిక విద్యకు ముస్లింలు దూరమయ్యారు. దాంతో 1950లో ప్రభుత్వోద్యోగాల్లో ముస్లింలు 40% ఉండగా, 2010 నాటికి అది 5 శాతానికి చేరింది. అప్పుడు వారికి 35% భూములుండగా, ప్రస్తుతం అది 4 శాతానికి పడిపోయింది. పోలీస్ చర్య అనంతరం గ్రామాల్లోని ముస్లింలను వెళ్లగొట్టి వారి భూములను అక్కడి వెలమ, రెడ్డి కులస్తులు తీసేసుకున్నారు. ప్రస్తుతం 70% పైగా ముస్లింలు నగరాల్లో, చిన్నచిన్న పట్టణాల్లో మెకానిక్‌లుగా, టైలర్లుగా, డ్రైవర్లుగా జీవనం వెళ్లదీస్తున్నారు. ఉద్యమంపై భిన్న కోణాలు తెలంగాణ ఉద్యమం ప్రధానంగా భూమికి, నీటికి, వ్యవసాయ సంక్షోభానికి సంబంధించినది కావడంతో వ్యవసాయ భూములు లేని ముస్లింలను అది ఆకర్షించలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలోగ్రామాల్లోని ముస్లింలు తటస్థంగా ఉండటమో లేక నిశ్శబ్దంగా మద్దతు ప్రకటించడమో చేశారు. పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న ముస్లింలు ఉద్యమంపై నిరాసక్తత చూపారు. మధ్యతరగతి ముస్లింలు, ముస్లిం లాయర్లు, టీచర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉద్యమాన్ని ప్రోత్సహించారు. అందులో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో నివసించే ముస్లింలు, జిల్లాల్లో ఎంఐఎం పార్టీకి మద్దతిచ్చేవారు మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. అయితే తెలంగాణ ఉద్యమంలో ముస్లింలు చురుగ్గా పాల్గొనలేదన్న భావన హిందువుల్లో బలంగా ఉంది. ఉర్దూను అధికార భాషగా తొలగించిన తరువాత ముస్లింలు మిగతా సమాజంతో కలిసేందుకు ఇష్టపడలేదని, ఆధునిక విద్యపై ఆసక్తి చూపలేదని, అందువల్లనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేకపోయారని, అంతేగానీ వారిపై వివక్ష ఎన్నడూ లేదని వారు వాదిస్తున్నారు. ముస్లింలే దేశభక్తులు: ‘దేశ విభజన సమయంలో హిందువులకు భారత్‌లో ఉండటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. కానీ ముస్లింలకు పాకిస్తాన్ అనే ప్రత్యామ్నాయం ఉంది. అయినా, ముస్లింలు భారత్‌లో ఉండేందుకే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది నిజమైన దేశభక్తో?’ అని ఎంఐఎం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు హబ్దుల్ హజీమ్ ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రాంతీయతత్వం ఉంటే తెలంగాణలో మతతత్వం ఉందని నల్గొండకు చెందిన అనీస్ ముఖ్తాదార్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో ముస్లింలు అక్కడి సమాజంతో మమేకమయ్యారని, వెనకబాటుతనం కారణంగా తెలంగాణలో వారికి మిగతా సమాజంతో దూరం పెరిగిందని అనీస్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రలో అస్తిత్వం కోల్పోయారు ఈ అభిప్రాయంతో టీ జేఏసీ చైర్మన్ కోదండరాం విభేదిస్తున్నారు. ముస్లింలు ఆంధ్ర ప్రాంతంలో తమ భాష అయిన ఉర్దూ సహా తమ అస్తిత్వాన్ని, తమ ప్రత్యేకతను కోల్పోయారని, అందుకే అక్కడి సమాజంలో కలిసిపోగలిగారని వివరించారు. ‘ఇక్కడలా కాదు. వారి అస్తిత్వం ఇక్కడ బలంగా ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల ముస్లింలకు తమ గొంతుకను వినిపించే అవకాశం కలిగింది, వారితో చర్చలకు ఆస్కారం ఏర్పడింది. ఉద్యమంలోనూ వారు చురుగ్గా పాల్గొన్నారు’ అన్నారు. ఓట్లకు మతం రంగు మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి 2011లో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఈ హిందూ-ముస్లిం మధ్య ఓట్ల చీలిక స్పష్టంగా కనిపించింది. ఒక వర్గం ఓట్లను తమవైపుకు ఆకర్షించుకోవడం కోసం మత కలహాలు సృష్టించే ప్రయత్నాలు కూడా అప్పుడు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. లౌకికవాదం పఠించే తెలంగాణ జేఏసీ కూడా ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిందని ముస్లింలు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ముస్లింలు, రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో విరుద్ధ అభిప్రాయాలు కలిగిన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సమ్మిళిత అభివృద్ధి మంత్రం పఠిస్తున్నాయి. అయితే, రాజకీయ ప్రాతినిధ్యమే తమ సమస్యలకు పరిష్కారమని ముస్లింలు నమ్ముతుండగా, పార్టీలు మాత్రం టికెటిచ్చేందుకు గెలుపు అవకాశాలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. ముస్లిం వ్యక్తికి టికెటిస్తే ఆ నియోజకవర్గంలోని హిందూ ఓట్లకు దూరమవుతామన్న భయం పార్టీల్లో నెలకొని ఉంది. ముస్లింలకు టికెటిస్తే వారు గెలవలేరని, ఈ ఎన్నికల్లో ముస్లింలెవరికీ టికెటివ్వబోమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ప్రకటించారు. ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ నుంచి కూడా ఆయన వెనక్కు తగ్గారు. అయితే కేసీఆర్‌ను మతవాదిగా ఇక్కడి ముస్లింలు భావించడం లేదు. ఒక్క బీజేపీనే కాదు, ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వని పార్టీలన్నీ మతవాద పార్టీలేనని ఎల్జేపీ నేత షహదత్ అలీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన పార్టీల్లో ఎంఐఎం ఒకటి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల సంఘ్ పరివార్ శక్తులు బలోపేతమవుతాయని ఎంఐఎం భావిస్తోంది. అయితే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలతో భూ వ్యవహారాలు, వ్యాపార సంబంధాలు ఉండటం వల్లనే ఎంఐఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిందని ఉర్దూ దినపత్రిక సియాసత్ ఎడిటర్ ఆరోపిస్తున్నారు. - అజయ్ గుడవర్తి, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ