రాష్ట్రంలో అతి పెద్ద నిరుద్యోగి ...
వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నేత గౌతంరెడ్డి ఆరోపణ
అంగన్‌వాడీలకు వేతనాల పెంపు జీవో జారీచేయాలని డిమాండ్
విజయవాడ: రాష్ట్రంలో అతి పెద్ద నిరుద్యోగి నారా లోకేశ్ అని, 18 నెలల్లో దోచుకున్న రూ. 2.50 లక్షల కోట్లను చంద్రబాబు తన తనయుడికి కానుకగా ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ఆరోపించారు. విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో వేతనాలు జీవో విడుదల చేయాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం రెండో రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని గౌతంరెడ్డి శనివారం సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యటనలకు రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబుకు అంగన్‌వాడీల వేతనాలను చెల్లించేందుకు మాత్రం చేతులు రావడం లేదన్నారు.
అంగన్‌వాడీలతో వెట్టిచాకిరీ చేయిస్తూ వేతనాలు ఇవ్వకుండా వారిని రోడ్డున పడేశారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఇస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో మాత్రం అంగన్‌వాడీ వర్కర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
వేతనాల కోసం అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతిస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్‌వాడీ సమస్యలను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, తదితరులు పాల్గొన్నారు.