
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఓ మునిగిపోయిన నావ.. దానికి అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు కెప్టెన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని విమర్శించడం.. సీఎం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. ప్రజా ధనాన్ని దోచుకున్న చంద్రబాబు నుంచి.. ఆ డబ్బంతా తిరిగి రాబడతామని పేర్కొన్నారు. రైల్వే జోన్ గురించి పోరాటం చేసింది వైఎస్సార్ సీపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. డివిజన్ లేకుండా ఎక్కడా జోన్ లేదని, అందుకే వాల్తేర్ డివిజన్‌తో కూడిన జోన్ కోసం వైఎస్సార్ సీపీ ఇప్పుడు డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.
మీరు ఎవరినైనా పిలిచారా?
రైల్వే జోన్ గురించి ఏమాత్రం పట్టించుకోని సీఎం, మంత్రి లోకేష్ ప్రస్తుతం హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాసం గురించి మాట్లాడే హక్కు లోకేష్‌కు లేదని చురకలంటించారు. తమ ఇంటి గృహ ప్రవేశానికి లోకేష్ ఎవరెవరిని పిలిచారో చెప్పాలంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఇంటి గురించి మాట్లాడే సీఎం చంద్రబాబు ఆంధ్రాలో ఎందుకు నివాసం ఉండటం లేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment