ఇస్లామాబాద్: భౌతికశాస్త్రంలో కీలక పరిశోధనలు చేస్తున్న యూరప్ అణు పరిశోధన సంస్థ(యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్-సెర్న్)లో పాకిస్తాన్ శుక్రవారం అసోసియేట్ సభ్యదేశంగా చేరింది. సెర్న్‌లో అసోసియేట్ సభ్యత్వ హోదా పొందిన మొదటి యూరపేతర దేశంగా పాక్ నిలిచింది. శాస్త్ర, సాంకేతిక రంగంలో భాగస్వామ్యం, శాంతియుత ప్రయోజనాలకు అణు ఇంధన వినియోగం వంటి అంశాలకు గుర్తింపుగా పాక్‌కు ఈ హోదా లభించినట్లు సెర్న్ ప్రకటించింది. దైవకణం ఉనికిని కనుగొనేందుకు సెర్న్ చేపట్టిన లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్ ప్రాజెక్టులో పాకిస్తాన్ కీలక తోడ్పాటునందించిందని ప్రశంసించింది.
అంకితభావంతో పనిచేసిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకే ఈ ఘనత దక్కుతుందని పేర్కొంది. కాగా, అసోసియేట్ సభ్యత్వం కోసం సెర్న్‌తో పాక్‌కు గత డిసెంబరులో ఒప్పందం కుదిరింది. దీనిపై అంతర్గత ప్రక్రియను పూర్తిచేయడంతో అసోసియేట్ సభ్య దేశంగా హోదాను పొందింది. అసోసియేట్ సభ్యదేశంగా పాకిస్తాన్‌కు సెర్న్ పాలనావ్యవహారాల్లో భాగస్వామ్యం లభిస్తుంది. పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాల్లో మరిన్ని అవకాశాలు, ఎక్కువ మంది శాస్త్రవేత్తలు పాల్గొనేందుకు అవకాశం లభిస్తాయి.
పాకిస్తాన్ కంపెనీలు కూడా సెర్న్ కాంట్రాక్టులు దక్కించుకోవచ్చు. అయితే, సెర్న్ పరిశోధనల్లో వంద మందికిపైగా శాస్త్రవేత్తలతో అత్యంత కీలక తోడ్పాటునందిస్తున్న భారత్‌ను వెనక్కినెట్టి మరీ పాకిస్తాన్ ఈ హోదాను సాధించడం గమనార్హం. హోదా పొందేందుకు అలసత్వంతో భారత్ సరైన ప్రక్రియను పూర్తి చేయకపోవడమే రేసులో వెనకపడటానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్తాన్‌కు సెర్న్‌లో సభ్యత్వం
Published Sun, Aug 2 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM
Advertisement
Advertisement