విజయవాడ: మహిళలకు 33శాతం రిజర్వేషన్లపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఘాటుగా స్పందించారు. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని అందరూ అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. చంద్రబాబుకు ఒక్కటే విషయం స్పష్టంగా చెప్తున్నానంటూ.. ఎవరో ఇస్తే తీసుకునేది రిజర్వేషన్ కాదన్నారు.
మహిళా రిజర్వేషన్ దేశానికి అవసరమని చెప్పారు. మహిళల జనాభా దేశంలో సగమే కావొచ్చు కానీ ప్రతి కుటుంబాన్ని నడిపిస్తుంది మాత్రం మహిళలేనని అన్నారు. మహిళా రిజర్వేషన్ అనగానే పార్లమెంటులో కొంతమంది పేపర్లు చించుతూ నినాదాలు ఇస్తున్నారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ పట్ల మాత్రమే ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించగలుగుతామని అన్నారు.