అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కాల్ మనీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం అనంతపురం జిల్లా తాడిపత్రి, గుత్తిలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడి చేసి... దాదాపు రూ. 4 కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లతోపాటు 20 ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై మంగళవారం అర్థరాత్రి పోలీసులు సోదాలు చేశారు. కె.వెంకటేశ్వరరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని, అతని నుంచి 59 ప్రామిసరీ నోట్లు, ఆరు ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. సోదాల నేపథ్యంలో పలువురు వ్యాపారులు పరారీలో ఉన్నారు
విజయనగరం: జిల్లా లోని పలు ప్రాంతాల్లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడి చేసి... 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు: ‘కాల్‌మనీ’ వ్యవహారం నేపథ్యంలో జిల్లాలోని వినుకొండ పోలీసులు వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలపై దృష్టి సారించారు. స్థానికంగా 30 మంది వ్యాపారులను గుర్తించి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, ఆభరణాలు, నగదు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.