అంగుళం భూమి కూడా తీసుకోనివ్వం
హనుమాన్‌గఢ్(రాజస్థాన్): భూసేకరణ చట్టాల కింద పేదలు, రైతుల భూమిని ఒక్క అంగుళం కూడా తీసుకోనివ్వబోమని.. ఈ విషయంలో ప్రధాని మోదీ, బీజేపీలను ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనివ్వబోమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమని ఆయన మండిపడ్డారు. గురువారం రాజస్తాన్‌లో హనుమాన్‌గఢ్ జిల్లాలోని పలు గ్రామాల్లో రాహుల్‌గాంధీ 8 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి, రైతులతో మాట్లాడారు.
ఖొటావలి గ్రామంలో ‘బహిరంగ సమావేశం’ నిర్వహించి రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ‘ప్రజా ప్రయోజనాల కోసం బీజేపీ, ఎన్డీయేలతో కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పడానికే నేను మీ వద్దకు వచ్చాను. మనం వారిని ఒక్క అంగుళం భూమిని కూడా తీసుకోనివ్వొద్దు. ఈ విషయంలో బీజేపీని ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనివ్వొద్దు. కాంగ్రెస్ పేదలు, రైతులు, కార్మికుల పార్టీ.
మీకేదైనా సమస్య వస్తే కాంగ్రెస్ మీ పక్షాన ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి..’ అని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తాను అవినీతికి పాల్పడనని, ఎవరినీ అవినీతికి పాల్పడనివ్వబోనని ప్రధాని మోదీ చెప్పారని.. ఇప్పుడు బీజేపీ నేతలు అవినీతికి పాల్పడిన విషయంపై ఆయన నోరు మెదపడం లేదేమని ప్రశ్నించారు. వ్యాపమ్ కుంభకోణం, లలిత్‌మోదీ వ్యవహారంపై మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.