
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో మార్చి 16న ప్రారంభమైన భట్టి యాత్ర ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, పరిగి మీదుగా ఈ నెల 16న రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలో అడుగుపెట్టింది. 17న యాత్ర ఇదే మండలంలోని రుక్కంపల్లికి చేరుకుంది.
ఇప్పటివరకు 25 నియోజకవర్గాల్లో 800 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. అయితే వడదెబ్బతో డాక్టర్ల సూచన మేరకు 18 నుంచి యాత్రకు విరామం ప్రకటించారు. నాలుగు రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో మళ్లీ పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మంచిర్యాలలో బహిరంగ సభ నిర్వహించగా.. తాజాగా మరో మూడు చోట్ల బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు పార్టీ నేతలతో చర్చలు జరిపిన ఆయన జాతీయ నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నెల 25 లేదా 26న జడ్చర్లలో సభ నిర్వహణకు శ్రీకారం చుట్టగా.. ముఖ్యఅతిథిగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రానున్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తదితర ముఖ్యనేతలు ఈ సభకు హాజరుకానున్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు చేరుకున్న తర్వాత ఈ నియోజకవర్గ పరిధిలో లక్ష మందితో బహిరంగ సభకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ సభకు అగ్ర నేత ప్రియాంకాగాందీని, ఖమ్మంలో ముగింపు సందర్భంగా మూడు లక్షల మందితో నిర్వహించే సభకు రాహుల్‌గాందీని ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ సభలకు సంబంధించి కాంగ్రెస్ ముఖ్యనేతలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా.. తేదీల ఖరారుపై స్పష్టత రావాల్సి ఉంది. వడదెబ్బతో యాత్రకు కొంత విరామం ప్రకటించామని.. అయినా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.