ఇద్దరు భారతీయులకు మెగసెసె | Sanjiv Chaturvedi, Anshu Gupta win Ramon Magsaysay Award | Sakshi
Sakshi News home page

ఇద్దరు భారతీయులకు మెగసెసె

Published Thu, Jul 30 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

ఇద్దరు భారతీయులకు మెగసెసె

ఇద్దరు భారతీయులకు మెగసెసె

ఐఎఫ్‌ఎస్ అధికారి చతుర్వేది,  గూంజ్ ఎన్జీవో వ్యవ స్థాపకుడు అన్షు గుప్తాకు పురస్కారం
* ఎయిమ్స్‌లో అవినీతిపై పోరాడిన చతుర్వేది
* పాత బట్టలు, గృహోపకరణాలు సేకరించి పేదవారికి అందిస్తున్న గూంజ్
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది. ఎయిమ్స్ మాజీ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేది, గూంజ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అన్షు గుప్తా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) అధికారి అయిన చతుర్వేది(40) ప్రస్తుతం ఎయిమ్స్‌కు డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

ఎయిమ్స్‌లో సంచలనం సృష్టించిన కుంభకోణాలపై ఈయన దర్యాప్తు ప్రారంభించి ప్రశంసలు అందుకున్నారు. నిజాయతీగల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కిందటేడాది ఆగస్టులో ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేశారు. అత్యంత సాహసం, నిజాయతీతో అవినీతి నిర్మూలనకు కృషి చేసినందుకుగాను ‘ఎమెర్జెంట్ లీడర్‌షిప్’ కేటగిరీ కింద చతుర్వేదిని పురస్కారానికి ఎంపికచేసినట్లు రామన్ మెగసెసె అవార్డు ఫౌండేషన్(ఆర్‌ఎంఏఎఫ్) ప్రకటించింది. ఇక అన్షు గుప్తా కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి 1999లో గూంజ్ ఎన్జీవోను స్థాపించారు.

పాత  బట్టలు, గృహోపకరణాలను సేకరించి వాటిని నిరుపేదలకు అందించే సదుద్దేశంతో ఈయన ఈ సంస్థను నెలకొల్పారు. ఇతరులకు సాయం చేయడంలో సృజనాత్మకతను జోడించి మానవత్వాన్ని చాటారంటూ ఆర్‌ఎంఏఎఫ్ కొనియాడింది. ‘ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అత్యావశ్యకం. కనీస అవసరమైన బట్ట అందరికీ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తూ అది దానం చేసే వస్తువుగా మారిపోయింది. నిజానికి పేదరికమే అతిపెద్ద విపత్తు. దీని నిర్మూలనకు దీర్ఘకాలిక సహాయక చర్యలు చేపట్టాలి’ అని అన్షు గుప్తా పేర్కొన్నారు.
 
పీఎంవోపై చతుర్వేది అసంతృప్తి
విధులు నిర్వర్తించిన ప్రతిచోటా చతుర్వేది అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా ఆయనకు బదిలీలే బహుమానంగా వచ్చాయి. గత ఐదేళ్లలో ఏకంగా 12 సార్లు బదిలీ అయ్యారు. మెగసెసె అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే ప్రధాని కార్యాలయం(పీఎంవో) పనితీరుపై చతుర్వేది తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘నిజాయితీ గల అధికారులకు ఈ అవార్డు నైతిక మద్దతు ఇచ్చింది. ‘నేను లంచం తీసుకోను.. మరొకరితో తీసుకోనివ్వను’ అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకే పని చేశా. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఇదే స్ఫూర్తితో ఎయిమ్స్‌లో అవినీతిపై పోరాడా.

సంస్థలోని అవకతవకలన్నింటిపై సాక్ష్యాలు సేకరించి పీఎం వోకు పంపాను. పారదర్శక దర్యాప్తు జరిపించి అవినీతి జలగలపై చర్యలు తీసుకోవాలని కోరాను. కానీ ఏం జరగలేదు. పెపైచ్చు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండడం వల్లే నేను ఈరోజు బతికి ఉన్నా’’ అని ఆయన పేర్కొన్నారు.
 
మరో ముగ్గురికి కూడా..
చతుర్వేది, అన్షు గుప్తాతోపాటు మరో ముగ్గురు కూడా మెగసెసె అవార్డుకు ఎంపికయ్యారు. లావోస్‌కు చెందిన కొమలై చాంతావాంగ్, ఫిలిప్పీన్స్‌కు చెందిన లిగయా ఫెర్నాండో-ఎమిల్‌బంగ్సా, మయన్మార్‌కు చెందిన క్యావ్ తు ఈ పురస్కారానికి ఎంపికైనట్లు ఆర్‌ఎంఏఎఫ్ ప్రకటించింది. ఫిలిప్పీన్స్ మూడో అధ్యక్షుడు రామన్ మెగసెసె గౌరవార్థం 1957 నుంచి ఈ అవార్డును అందజేస్తున్నారు.
 
అవార్డు నగదు పేదల సేవకే
రామన్ మెగసెసే అవార్డు కింద వచ్చే నగదు మొత్తాన్ని పేద ప్రజల సేవా కార్యక్రమాలకే ఉపయోగించనున్నట్లు అవార్డు విజేతలు సంజీవ్ చతుర్వేది, అన్షు గుప్తా బుధవారం వెల్లడించారు. చతుర్వేది.. అవార్డు కింద వచ్చిన మొత్తం రూ. 19 లక్షలనూ ఎయిమ్స్ ఖాతాలో వేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement