ఆసియా నోబెల్‌గా ప్రఖ్యాతిగాంచిన ‘రామన్ మెగసెసె’ అవార్డుకు చైనాకు చెందిన ఇద్దరు ఎంపికయ్యారు.
మనీలా: ఆసియా నోబెల్‌గా ప్రఖ్యాతిగాంచిన ‘రామన్ మెగసెసె’ అవార్డుకు చైనాకు చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసే వారికి అందించే ఈ అవార్డును గురువారం మొత్తం ఆరుగురికి ప్రకటించగా.. వారిలో చైనా జర్నలిస్టు హు షులీ (61), న్యాయవాది వాంగ్ కన్ఫా (55) ఉన్నారు. ఇండోనేసియాకు చెందిన మానవతాశాస్త్రజ్ఞుడు సౌర్ మర్లీనా మనురంగ్ (42), అఫ్ఘానిస్థాన్ నేషనల్ మ్యూజియం డెరైక్టర్ ఒమారా ఖాన్ మసౌది (66), ఫిలిప్పీన్స్ టీచర్ రేండీ హలాసన్ (31), పాకిస్థాన్ ఎన్‌జీఓ ది సిటిజన్స్ ఫౌండేషన్ ఉన్నాయి. బిజినెస్ మ్యాగజైన్ కయ్‌జింగ్‌కు ఎడిటరైన షులీ పరిశోధనాత్మక కథనాలు చైనాలో ప్రభావం చూపాయని, కార్పోరేట్ మోసాల్ని, 2003లో సార్స్ వ్యాధిపై ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారని మెగసెసె ఫౌండేషన్ తెలిపింది.