ఓ ప్రైవేటు కళాశాల బస్సు మందుల దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
బహదూర్‌పురా (హైదరాబాద్) : ఓ ప్రైవేటు కళాశాల బస్సు మందుల దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం... గురునానక్ ఇనిస్టిట్యూషన్స్‌కు చెందిన బస్సు పురానాపూల్ చౌరస్తాలోని గుడ్‌విల్ హోటల్ వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ కావడంతో సాయిబాబా మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది.
అదే సమయంలో షాపు వద్ద మందులు కొనుగోలు చేస్తున్న కామాటిపురా మురళీనగర్ ప్రాంతానికి చెందిన శివకళాబాయి (60) అక్కడికక్కడే మృతి చెందింది. ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన ప్రేమాబాయి, ఉస్మాన్‌బాగ్ ప్రాంతానికి చెందిన బషీర్ (32)కు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.