
హెచ్‌సీయూ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఘన విజయం
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఘన విజయం సాధించింది. ఎస్‌ఎఫ్‌ఐ, ట్రైబల్ స్టూడెంట్ ఫోరం (టీఎస్‌యూ), దళిత్ స్టూడెంట్ యూనియన్(డీఎస్‌యూ)లు ఒక కూటమిగా ఏర్పడి, మొత్తం అన్ని పదవులను కైవసం చేసుకొన్న ఏకైక కూటమిగా నిలిచింది. నూతన అధ్యక్షుడిగా కేరళకు చెందిన జుహైల్ కె.పి.(పి.హెచ్‌డీ-ఫిజిక్స్) గెలుపొందారు. సమీప ఏబీవీపీ అభ్యర్థి గురజాడపై 339 ఓట్ల మెజార్టీతో నూతన విద్యార్థి నాయకునిగా ఎన్నికయ్యాడు.
ఈ ఎన్నికల్లో జుహైల్‌కు 1,603 ఓట్లు రాగా, గురజాడకు 1,264 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షునిగా తెలుగు పీహెచ్‌డీ విద్యార్థి మూడావత్ వెంకటేష్ చౌహాన్ విజయకేతనం ఎగరవేశారు. 1,580 ఓట్లు సాధించి ఏబీవీపీ అభ్యర్థి కిరణ్ గుండాలపై 389 ఓట్ల మెజార్టీని సాధించాడు. ప్రధాన కార్యదర్శిగా రాజ్‌కుమార్ సాహు, సమీప అభ్యర్థి వందన రాథోడ్‌పై 190 ఓట్ల ఆధిక్యాన్ని సాధించాడు. వీరితో పాటు ఎస్‌ఎఫ్‌ఐ ప్యానల్‌కు చెందిన శివదుర్గారావు సంయుక్త కార్యదర్శిగా, చిలుక శ్రీలత సాంసృ్కతిక కార్యదర్శులుగా, సందీప్ కుమార్ క్రీడల కార్యదర్శిగా ఎన్నికైయ్యారు. వీరితో పాటు జీఎస్ క్యాష్ ప్రతినిధులుగా అలినా సెబాస్టియన్(పీహెచ్‌డీ), సనాఫాతిమా(ఐఎంఏ)లు విజయం సాధించారు.