ఎలుకలు, పిల్లులు, కుక్కలను రానివ్వొద్దు | special agency for rats control in hospitals | Sakshi
Sakshi News home page

ఎలుకలు, పిల్లులు, కుక్కలను రానివ్వొద్దు

Published Thu, Oct 29 2015 10:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

ఎలుకలు, పిల్లులు, కుక్కలను రానివ్వొద్దు

ఎలుకలు, పిల్లులు, కుక్కలను రానివ్వొద్దు

అవసరమైతే వీటి నియంత్రణకు ప్రత్యేక ఏజెన్సీ
ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ తాజా నివేదిక


హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల దాడిలో శిశువు మృతి చెందిన ఘటన అటు ఆస్పత్రికి, ఇటు సిబ్బందికి ఇప్పటికీ భయాందోళన కలిగిస్తూనే ఉంది. బోధనాసుపత్రుల్లో ఇప్పటికీ ఎలుకలు వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి. శిశువుల వార్డులో తల్లిదండ్రులతో పాటు నర్సులకు నిద్ర కరువైంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఆవరణలో ఎలుకలు, పిల్లులు, కుక్కలు, పందులు, పందికొక్కులు వంటివాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అవసరమైతే వీటి నిర్మూలనకు ప్రత్యేక ఏజెన్సీని నియమించైనా ఇలాంటి వాటిని నియంత్రించాలని సూచించారు.

మళ్లీ వస్తూనే ఉన్నాయి..
ప్రధానంగా ఆస్పత్రుల్లో ప్రతి వార్డులోనూ ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని, ఎన్ని పట్టినా మళ్లీ వస్తూనే ఉన్నాయని, వీటికోసం ఇప్పటికే మందులు ఉపయోగించడం, బోన్‌లు ఏర్పాటు చేయడం జరుగుతోందని సూచించారు. రోగులు, రోగుల సహాయకుల భోజన వసతులకు ప్రత్యేక గదులు కేటాయించి, భోజనానంతరం వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు పడేసేందుకు చర్యలు తీసుకుంటే బావుంటుందని నివేదికలో పేర్కొన్నారు. గుంటూరు ఘటన అనంతరం పారిశుధ్య కాంట్రాక్టర్ పూర్తిగా ఎలుకల మీదనే దృష్టి సారించారని, ఎలుకల నివారణకు మరో ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో దోమల కారణంగా ఇన్‌పేషెంట్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటికైనా నెట్ (దోమతెర)లు ఏర్పాటు చేస్తే బావుంటుందని సూచించారు. ఇకపై పారిశుధ్య కాంట్రాక్టర్ పనితీరు, 96 శాతానికి మించితేనే 100 శాతం బిల్లులు ఇవ్వాలని నివేదికలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement