గుంటూరు:నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో ఐసీయూలో చికిత్ప పొందుతున్న చిన్నారి ఎలుకలు కొరికి మృతచెందడంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ వేణుగోపాల్, పీడియాట్రిక్ సర్జన్ భాస్కర్ రావులను బదిలీ చేస్తున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దీంతో పాటు స్టాఫ్ నర్సు విజయనిర్మల, హెడ్ నర్సు విజయలక్ష్మిలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆస్పత్రి ఘటనకు సంబంధించి తమకు ప్రాథమిక నివేదిక అందిందని కామినేని తెలిపారు. దీనికి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన శానిటేషన్ కాంట్రాక్టర్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్లతో సమావేశం కానున్నట్లు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి తెలిపారు.
ఇదిలా ఉండగా ఈరోజు ఆస్పత్రిలో భారీ సంఖ్యలో ఎలుకలు దొరికాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎలుకలు పట్టేవాళ్లను పిలిపించారు. మొత్తం పదిమందితో కూడిన ఓ బృందం ఆస్పత్రికి చేరుకుని, తమదైన పద్ధతిలో బోనులు, ఎరలు ఏర్పాటుచేసింది. దాంతో 50 వరకు ఎలుకలు పట్టుబడ్డాయి.