అదే నిర్లక్ష్యం | Rats In GGH Hospital Guntur | Sakshi
Sakshi News home page

అదే నిర్లక్ష్యం

Published Tue, Jul 17 2018 1:34 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Rats In GGH Hospital Guntur - Sakshi

రాజధాని ఆస్పత్రిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్‌)లో అంతులేని నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. రోగుల భద్రతపై రోజురోజుకూ నీలినీడలు కమ్ముకుంటూనే ఉన్నాయి. చిన్నపిల్లల వార్డులో ఎలుకలు కరిచి పసికందు ప్రాణాలు కోల్పోయినా, ఆపరేషన్‌ థియేటర్‌లోకి పాములు వచ్చాయని వైద్యులు ఆపరేషన్లు నిలిపివేసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటంలేదు.

సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. వార్డుల వద్ద ఎలుకలు పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. చికిత్స కోసం ఆస్పత్రికి వస్తున్న రోగులకు ఇక్కడి అపరిశుభ్రత మరిన్ని వ్యాధులు సోకేలా చేస్తోంది. పారిశుద్ధ్యం మెరుగుదలపై శ్రద్ధ చూపాల్సిన ప్రభుత్వం, వైద్య విద్య ఉన్నతాధికారులు నిర్లక్ష్యాన్ని వీడటంలేదు. ఎలుకల దాడిలో పసికందు మృతి చెందినా, పాములు తిరుగుతున్నాయని వైద్యులు ఆపరేషన్‌లు నిలిపివేసినా ప్రభుత్వం, వైద్యవిద్య ఉన్నతాధికారుల తీరు మారడం లేదు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు తాత్కాలిక చర్యలతో హడావుడి చేయడం మినహా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలుకల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటన నేపథ్యంలో ప్రక్షాళన పేరుతో పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌ను ఉన్నతాధికారులు తొలగించారు. అతనికి ఇచ్చే సొమ్మును రెట్టింపు చేసి కొత్తవారికి పారిశుద్ధ్య బాధ్యతలు అప్పగిం చారు. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా చిన్నపిల్లల వార్డుల వద్ద పారిశుధ్యం అధ్వానంగా ఉంది. వార్డు చుట్టూ ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆ వార్డులో చికిత్సపొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2015 ఆగస్టు 26వ తేదీన శిశు శస్త్రచికిత్సా విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న పదిరోజుల పసికందును ఎలుకలు కొరికి చంపేశాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఇది జరిగి మూడేళ్లు కావస్తున్నా జీజీహెచ్‌లో పారిశుద్ధ్యం ఇప్పటికీ అధ్వానంగానే ఉంది. ఎలుకల నివారణకు తూతూమంత్రపు చర్యలు మినహా శాశ్వత పరిష్కారం తీసుకోలేదు. ఫలితంగా చిన్నారులచికిత్సా విభాగం చుట్టుపక్కల పారిశుధ్యం అధ్వానంగా ఉంది. మురుగు కూడా తిష్టవేసింది. దీంతో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. పసికందు మృతి తరువాత కూడా ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు కనువిప్పు కలగలేదని రోగులు, వారి బంధువులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఘటన జరిగిన కొంత కాలం ఎలుకలు ఉన్నాయనే కారణంతో వైద్యులు 15 రోజులు సర్జికల్‌ ఆపరేషన్‌ థియేటర్‌ (ఎస్‌ఓటీ)లో ఆపరేషన్‌లు చేయకుండా నిలిపివేశారు. ఆ తరువాత తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్‌లోకి ఎలుకలు రాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన జీజీహెచ్‌ అధికారులు అది మరిచి ఎలుకలు, పాములు కనిపించినా ఎవరికీ చెప్పొద్దంటూ సిబ్బంది, రోగులకు హుకుం జారీ చేశారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎవరైనా సమాచారాన్ని బయటకు పంపితే వారిపై చర్యలు తీసుకునేందుకూ వెనకాడటం లేదు.

పారిశుద్ధ్యం నిల్‌.. మార్కులు ఫుల్‌
జీజీహెచ్‌లో పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు గతంలో చెల్లించిన మొత్తం కంటే రెట్టింపు ముట్టజెబు తున్నా పారిశుద్ధ్యం మాత్రం మెరుగు పడని పరిస్థితి. నిత్యం పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించి సక్రమంగా లేకపోతే వారికి మార్కులు తగ్గించి నెలానెలా చెల్లించే డబ్బులో తగ్గించాల్సి ఉంది. అయితే జీజీహెచ్‌ ఉన్నతాధికారులు మాత్రం పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు ఫుల్‌గా మార్కులు వేసేస్తున్నారు. ఎలుకల దాడి ఘటనకు ముందుకు పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌ మూడు విభాగాలకు కలిపి కాంట్రాక్టర్‌కు నెలకు రూ.21 లక్షలు చెల్లించేవారు. ఆ తరువాత ప్రక్షాళన పేరుతో కాంట్రాక్టర్‌ను తొలగించి అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ అనుచరుడికి కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించారు. ఇతనికి పారిశుద్ధ్యం, పెస్ట్‌ కంట్రోల్‌ రెండు విభాగాలకే ఏకంగా రూ.50 లక్షలు చెల్లిస్తున్నారు. పారిశుద్ధ్యం ఆ స్థాయిలో మెరుగు పడిందా అంటే అదీ లేదు. పిల్లల వార్డు వద్ద అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం వారికి కనిపిం చడం లేదా అంటూ జీజీహెచ్‌ సిబ్బంది, రోగులు గుసగుసలాడుతున్నారు.  

పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటే మార్కులు కట్‌ చేస్తాం
జీజీహెచ్‌లో నూతన భవన నిర్మాణాలు జరుగుతుండటంతో కొంత పారిశుద్ధ్యం సమస్య ఉన్న మాట వాస్తవమే. ఎలుకల నివారణకు పెస్ట్‌ కంట్రోలర్‌ కాంట్రాక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. పారిశుద్ధ్యంపై నిరంతర పరిశీలన జరుపుతాం. అప్పటికీ మెరుగు పరచుకోకపోతే మార్కులు కట్‌ చేసి వారికి చెల్లించే డబ్బులు తగ్గిస్తాం. జీజీహెచ్‌లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటాం.
– ఆదినారాయణ, ఆర్‌ఎంఓ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement