
సెల్‌ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
జగిత్యాల: సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఉదయం జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాలలో చోటు చేసుకుంది. స్ధానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తిరుపతి ఏడో తరగతి చదువుతున్నాడు. తన స్నేహితులందరికీ వద్ద సెల్‌ఫోన్ ఉందని.. తనకూ ఓ సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు.
చిన్నవయసులో ఫోన్ ఇవ్వడం మంచిది కాదని భావించిన తల్లిదండ్రులు అప్పుడే వద్దని చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి బుధవారం ఉదయం పాఠశాల ఆవరణలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ప్రధానోపాధ్యాయునికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలాన్నిపరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.