11వ రోజూ అరకోటి
* తెలంగాణలో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
* పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌లు
సాక్షి, నెట్‌వర్క్: గోదావరి మహా పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రానికి పుష్కర ఘడియలు సమాప్తం కానున్నాయి. దాంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. సాయంత్రం ఆరింటి వరకే అర కోటి మందికిపైగా పుష్కర స్నానమాచరించినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
దాంతో ఘాట్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల ముగిం పు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. మంత్రులు ప్రధాన పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గోదావరికి మహా హారతి పట్టనున్నారు.
ఎటు చూసినా భక్త జనమే
భద్రాచలంలో శుక్రవారం ఉదయం నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కొత్తగూడెం వద్ద ప్రైవేట్ వాహనాలను నిలిపేసి దశలవారీగా వదిలారు. స్థానిక సారపాక యాగశాలలో యజ్ఞం చేస్తున్న నాగ, వైష్ణవ సాధువులు భద్రాచలం ఘాట్‌లో పుష్కరస్నానం చేశారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు, కందకుర్తి పుష్కర ఘాట్లకు భక్త జనం పోటెత్తుతోంది. ఈ రెండు ఘాట్ల వద్ద శుక్రవారం ఒక్కరోజే 6 లక్షల మందికిపైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. కోటిలింగాల, ధర్మపురిల్లో శుక్రవారం ఉదయం 5 కి.మీ. మేరకు ట్రాఫిక్ జామైంది.
కాళేశ్వరం కూడా మధ్యాహ్నానికే కిక్కిరిసింది. వర్షానికి తోడు ఎగువన నీటిని విడుదల చేయడంతో ఇక్కడ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వీఐపీ, ప్రధాన ఘాట్‌ల వద్ద ప్రవాహం ఆరు మీటర్ల మేర పెరిగింది. బాసరలోనూ రద్దీ కొనసాగుతోంది. భక్తులు బస్సుల టాప్‌పై కూర్చుని ప్రయాణిస్తున్నారు. మంచిర్యాల గోదావరి తీరం వద్ద ఎన్నడూ లేనివిధంగా శుక్రవారం ఒక్కరోజే 3.74 లక్షల మంది పుష్కర స్నానం చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. సోన్ ఘాట్ కిక్కిరిసింది.
రద్దీ పెరగడంతో లక్ష్మణచాంద మండలంలోని పలు ఘాట్లకు భక్తుల వాహనాలను మళ్లించారు. వరంగల్ జిల్లా మంగపేట ఘాట్‌లో 1.7 లక్షలు, రామన్నగూడెంలో 30 వేల మంది స్నానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ఘాట్లలో మంత్రులు ఇతర ప్రముఖులు పుష్కర స్నానం చేశారు. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల్ సర్పంచ్ శంకర్ పుష్కర స్నానానికి వచ్చి అస్వస్థతకు గురై మహదేవపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
మోర్తాడ్: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పుష్కరాల తరువాతనైనా వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని దేవుడిని వేడుకున్నట్లు వైఎస్సార్‌సీపీ నేత, ఏపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకల్ ఘాట్‌లో శుక్రవారం ఆయన పుష్కరస్నానం చేశా రు. పిండప్రదానం చేసి, కోదండ రామాలయంలో పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా దోంచంద ఘాట్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు భీష్మ రవీందర్, ఎం. శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పుష్కర స్నానాలు చేశారు.