శుభ మంగళం | telangana godavari pushkaralu | Sakshi
Sakshi News home page

శుభ మంగళం

Published Sun, Jul 26 2015 3:17 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

శుభ మంగళం

శుభ మంగళం

తెలంగాణలో 12 రోజుల్లో 6.76 కోట్ల మంది పుష్కర స్నానాలు
సాక్షి నెట్‌వర్క్: 12 రోజులపాటు అత్యంత వైభవోపేతంగా సాగిన గోదావరి పుష్కరాలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను నింపిన పుష్కరుడికి జనకోటి భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలికారు. శనివారం సాయంత్రం ప్రధాన పుష్కర ఘాట్ల వద్ద ప్రభుత్వం తరఫున మంత్రులు గోదారమ్మకు మహాహారతినిచ్చారు. ఆది పుష్కరాల వీడ్కోలు కార్యక్రమానికి జనం లక్షలాదిగా తరలివచ్చారు. ఈసారి పుష్కరాలకు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో భక్తులు పోటెత్తారు.

పన్నెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 6.76 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 2.93 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. కాళేశ్వరంలో 83 లక్షలు, ధర్మపురిలో 93 లక్షలు, మంథనిలో 24 లక్షలు, కోటిలింగాలలో 20 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. శనివారం కాళేశ్వరంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి చెంచులతో కలిసి పుష్కర స్నానం ఆచరించారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకతోపాటు ఇతర  రాష్ట్రల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు జిల్లాకు తరలివచ్చారు.

ఈనెల 14న ఉదయం 6.21 నిమిషాలకు సీఎం కేసీఆర్ దంపతులు ధర్మపురిలో పుణ్యస్నానాలు చేసి పుష్కరాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ధర్మపురిలో, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బాసరలో గోదారమ్మకు మహా హారతి ఇచ్చి 12 రోజుల పుష్కర వేడుకలకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఘనంగా పుష్కర శోభాయాత్ర నిర్వహించారు.
 
కన్నుల పండువగా వేడుకలు..
బాసరలో చదువుల తల్లి సరస్వతీ వెలసిన వ్యాసపురిలో పుష్కరాల ముగింపు ఉత్సవం కన్నుల పండువగా సాగింది. బాసర ఆలయం నుంచి గోదావరి వరకు సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. తొలుత సరస్వతీ అమ్మవారి విగ్రహా న్ని పల్లకిలో శోభాయాత్రగా గోదావరి నది వద్దకు తీసుకువెళ్లారు. మేళతాళాలు, భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల మధ్య అమ్మవారిని స్మరిస్తూ నదీ తీరానికి చేరుకున్న అర్చకులు, పూజారులు పూజలు చేశారు.

నదీతీరాన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి అందరినీ చల్లగా చూడాలంటూ వేడుకున్నారు. అనంతరం నది మధ్యకు వెళ్లి సంప్రదాయక మొంటెల వాయినం సమర్పించారు. అనంతరం గోదావరి నదికి మహా హారతినిచ్చారు. హారతి సమయంలో వరుణుడు చినుకులు కురిపించడంతో భక్తులు పులకరించిపోయారు. శనివారం అత్యధికంగా మంచిర్యాల గోదావరి తీరం వద్ద సుమారు మూడు లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. బాసరలో లక్షకు పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, జెడ్పీచైర్మన్ శోభారాణి, ఎంపీ నగేశ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
 
భద్రాచలంలో 33 లక్షల మంది..
పుష్కరాల్లో భాగంగా 12 రోజుల్లో ఖమ్మం జిల్లాలో అరకోటికిపైగానే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అందులో ఒక్క భద్రాచలంలోనే 33 లక్షల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు. పర్ణశాల, మోతె ఘాట్ లు కూడా కిక్కిరిసిపోయాయి. శనివారం పుష్కరాలు ముగిసేసరికి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎనిమిది ఘాట్లకు 68 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. అయోధ్య, కాశీ నుంచి తరలివచ్చిన సాధువులు యాగం నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.

భద్రాచలం వచ్చిన సాధువులు గోదావరిలో పుష్కరస్నానం చేసి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం డీజీపీ అనురాగ్‌శర్మ మోతెలో పుష్కర స్నానం ఆచరించారు. పోలీసు అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. భద్రాద్రి రామయ్యను 12 రోజుల్లో సుమారు 10 లక్షల మందికిపైగా దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో చివరి మూడు రోజులు వీఐపీ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు.
 
‘పుష్కర’ సిబ్బందికి సీఎం అభినందనలు
తెలంగాణలో గోదావరి మహాపుష్కరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ఒక ప్రకటనలో అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఐదు జిల్లాల్లో స్నానం చేసిన కోట్లాది మంది భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆది పుష్కరాలను దిగ్విజయం చేశారని కొనియాడారు.
 
పుష్కర ఉద్యోగులకు రెండు రోజుల సెలవు
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పుష్కర విధులు నిర్వహించిన ఉద్యోగుల సెలవుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement