కోటెత్తిన పుష్కరం!
తెలంగాణలో 9 రోజుల్లో 4 కోట్ల మంది పుణ్య స్నానాలు
* బుధవారం అరకోటికిపైగా తరలివచ్చిన భక్తులు
* పుష్కర క్షేత్రాలన్నీ కిటకిట.. తప్పని ట్రాఫిక్ తిప్పలు
* మంథని సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
* డిచ్‌పల్లిలో మరో ఇద్దరు మృత్యువాత
సాక్షి నెట్‌వర్క్: ఎక్కడ చూసినా గంటల కొద్దీ ట్రాఫిక్ జాం.. చాలా ఘాట్ల వద్ద అపరిశుభ్రత.. కలుషిత నీరు.. దైవదర్శనం కోసం ఏడెనిమిది గంటల నిరీక్షణ..
తాగునీరు, కనీస సౌకర్యాలూ కరువు! అయితేనేం.. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు గోదావరి పుష్కరాలకు బారులు తీరుతూనే ఉన్నారు. గత 9 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పుష్కరాల్లోనూ ఇదే రికార్డు. 2003 గోదావరి పుష్కరాల్లో 12 రోజులకు ఉమ్మడి రాష్ట్రంలో 3.5 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానం చేశారు. ఈసారి అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలోనే 9 రోజుల్లో ఈ సంఖ్య 4 కోట్లు దాటింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అరకోటి మందికిపైగా భక్తులు పుష్కర స్నానం చేశారు.
కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నానికే 18 లక్షలకు పైగా స్నానాలు చేశారు. ధర్మపురి, కాళేశ్వరాల్లో రద్దీ విపరీతంగా ఉంది. ధర్మపురికి 9 లక్షలు, కాళేశ్వరానికి 5 ల క్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. ధర్మపురి నుంచి 30 కి.మీ. మేర రాకపోకలు స్తంభించాయి. వరంగల్ జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న జల్లులతో పుష్కర ప్రాంగాణాలకు వెళ్లే దారులు బురదమయమయ్యాయి.
మహరాష్ట్రలో కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా గూడెం, చెన్నూరు, మంచిర్యాల వద్ద గోదావరిలోకి కొంత నీరు చేరింది. బాసర, సోన్ పుష్కర ఘాట్లకు భక్తుల తాకిడి పెరిగింది. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ భక్తుల తాకిడి పెరిగింది. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో వర్షం పడుతున్నా భక్తులు భారీగా వచ్చారు.
వాహనం చెట్టును ఢీకొని ఆరుగురి మృతి
కరీంనగర్ జిల్లాలో మంథని సమీపంలోని ఎక్లాస్‌పూర్ వద్ద ఓ వాహనం చెట్టుకు ఢీకొనడంతో పుష్కర స్నానానికి కాళేశ్వరం వెళ్తున్న ఆరుగురు మరణించారు. మరో 10 మంది గాయాలపాలయ్యారు. మృతులంతా మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లెవాసులు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఇద్దరు మరణించారు.
నాలుగు కోట్ల మంది పుణ్యస్నానాలు
మోర్తాడ్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఘాట్లలో నాలుగు కోట్ల మంది పుష్కర స్నానాలను ఆచరించారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని గుమ్మిర్యాల్ పుష్కర ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించిన ఆయన శ్రీకృ ష్ణ మందిరంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుతోనే పుష్కరాలు ఇంత గొప్పగా సాగుతున్నాయని చెప్పారు.
వీఐపీ దర్శనాలు రద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంలోని దేవాలయాల్లో వీఐపీ, స్పెషల్, టికెట్ దర్శనాలు రద్దు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఆలయాలలో భక్తులందరికీ ఉచిత దర్శన అవకాశం కల్పించాలని సూచించారు. దర్శనం టికెట్ల అమ్మకాలను తక్షణం నిలిపేయాలని స్పష్టంచేశారు. పుష్కరాలపై సీఎం బుధవారం అధికార నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మపురి, కాళేశ్వరంలలో పర్యటించి వచ్చిన డీజీపీ అక్కడి పరిస్థితిని వివరించారు.