తిరుపతి క్రైం: తిరుపతిలోని ఓ హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థినులు ఇద్దరూ సోమవారం తమ గ్రామం చేరుకున్నారు. ఒకరిని విజయవాడ నుంచి పోలీసులు తీసుకురాగా, మరో బాలిక తానే ఒంటరిగా స్వగ్రామం చేరుకుంది.
చదువుపై ఇష్టం లేకే..
ఏర్పేడు మండలం కోబాకకు చెందిన విద్యార్థినులు తిరుపతిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ పదోతరగతి చదువుతున్నారు. వారిద్దరూ ఈనెల 24న స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో వీరు వరంగల్‌లో కీచకుల బారినపడినట్టు ప్రచారం జరిగింది. బాలికల అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న తిరుపతి అలిపిరి ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి ఓ బాలిక విజయవాడలో ఉన్న సమాచారం తెలుసుకుని సోమవారం ఆమెను తీసుకువచ్చారు.
అలాగే వరంగల్‌లో అదృశ్యమైన బాలిక కూడా ఒంటరిగా సోమవారం స్వగ్రామం చేరుకుంది. వీరిద్దరినీ పోలీసులు విచారించగా.. బాలికలకు చదువుపై ఆసక్తి లేదని, దీంతో కరీంనగర్‌లో ఉన్న స్నేహితురాలి వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతో రైలులో వరంగల్ వెళ్లినట్లు తెలిసింది. రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక ప్లాట్‌ఫాంపై ఉండగా అక్కడ దుకాణంలో పనిచేసే ఒక వ్యక్తి బాలికలకు భోజనం పెడతానని చెప్పి తన గదిలోకి తీసుకెళ్లాడు.
ఆ గదిలోకి మరో ఇద్దరు యువకులు వచ్చి అనుమానాస్పదంగా మాట్లాడుకోవడంతో అప్రమత్తమైన ఒక బాలిక పరారై విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకుంది. అక్కడ చైల్డ్‌లైన్ సంస్థ సభ్యులు బాలికను గుర్తించి విషయం తెలుసుకున్నారు. అనంతరం ఆ సంస్థ వారు వరంగల్‌కు వెళ్లి బాలికలు తలదాచుకున్న గదికి వెళ్లి చూడగా మరో విద్యార్థిని కనిపించకపోవడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఓ బాలికను విజయవాడ నుంచి పోలీసులు తీసుకురాగా, మరో బాలిక ఒంటరిగా స్వగ్రామం చేరుకుంది.