'బాల' కీచకులపై కీలక నిర్ణయం: నిర్భయ కేసులో బాలనేరస్తుడి విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో బాలనేరస్తుల చట్టం సవరణ బిల్లు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ బిల్లును మంగళవారం సభలో ప్రవేశపెడ్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
డిసెంబర్ 8, 10, 11 తేదీల్లో రాజ్యసభ ఎజెండాలో ఈ బిల్లు ఉందని, అయితే, సభను కాంగ్రెస్ అడ్డుకోవడంతో దీనిపై చర్చ సాధ్యం కాలేదని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.బిల్లు ఆమోదం పొందితే అసాధారణ నేరాలకు పాల్పడ్డ 16 ఏళ్ల బాలలకు కూడా పెద్దలకు విధించే శిక్షలు అమలుచేసే అవకాశం ఉంటుంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ బాయికాట్ చేయడంతో ఏకపక్షంగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.
స్టాక్ సెక్యూరిటీల అమ్మకం: నిధులు సమకూర్చుకునేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం నేడు స్టాక్ సెక్యూరిటీలను వేలానికి ఉంచనుంది. 10 ఏళ్ల కాలానికిగానూ సెక్యూరిటీలను వేలయం వేయనున్నట్లు తెలిసింది.
బీదర్ కు రాష్ట్రపతి: ప్రస్తుతం శీతాకాలవిడిదిలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు కర్ణాటకలోని బీదర్ లో పర్యటించనున్నారు.
పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ: వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీ సెక్స్ రాకెట్, మహిళా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, అసెంబ్లీ సమావేశాల బాయికాట్, భవిష్యత కార్యాచరణ తదితర అంశాలపై చర్చజరిగే అవకాశంఉంది.
'మహా'తో చర్చలు: తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన తుమ్మిడిహట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చర్చలు జరిపేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని బృందం నేడు ముంబై వెళ్లనుంది. మహారాష్ట్ర నీటిపారుదల మంత్రితో హరీశ్ బృందం చర్చలు జరపనుంది.
ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు: డీడీసీఏలో అక్రమాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాలు తదితర కీలక విషయాలను చర్చించేందుకు ఢిల్లీ అసెంబ్లీ నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కానుంది.
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల దర్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా నేటి రాత్రి నుంచి ఆలయాన్ని మూసేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా 83,103 మంది స్వామివారిని దర్శించుకున్నారు.