
క్షేత్రస్థాయికి వెళ్లండి..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ఇటీవలి కాలంలో చేపట్టిన కార్యక్రమాలను అభినందిస్తూనే... క్షేత్రస్థాయికి వెళ్లి కార్యక్రమాలు చేపట్టాలంటూ పార్టీ నేతలకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఉపదేశించారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ, మండలిలో ప్రతిపక్షనాయకులు కె. జానారెడ్డి, షబ్బీర్‌అలీ కలిశారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతోపాటు, టీపీసీసీ, సీఎల్‌పీ పనితీరును సమీక్షించారు.
రాష్ట్ర రాజకీయాలతో పాటు ఓటుకు కోట్లు, ఫిరాయింపులు వంటి అంశాలను రాహుల్ రాష్ట్ర నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 30లోగా పార్టీ సభ్యత్వ ప్రక్రియను పూర్తిచేయాలని, పోలింగ్‌బూత్‌కు 50 మంది క్రియాశీల సభ్యులను పూర్తిచేసి అధిష్టానానికి నివేదిక పంపించాలని సూచించారు. అదేవిధంగా పార్టీనేతల వ్యక్తిగత పనితీరును కూడా అడిగితెలుసుకున్న రాహుల్.. పార్టీ సభ్యత్వ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి వివరాలు అందించాలని ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ, వరంగల్ నగరపాలక, వరంగల్ లోక్‌సభ ఎన్నికలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. నియోజకవర్గస్థాయిలో టీపీసీసీ సమావేశాలు నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్.. సీఎల్పీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా సరైన పాత్రను పోషించడం లేదని రాహుల్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
పార్టీ ఫిరాయింపులపై నిలదీస్తా...
సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు, ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకున్న అంశం, ఈ సందర్భంగా స్పీకరు, గవర్నరు వ్యవహరిస్తున్న తీరుపై పార్లమెంటులోనే నిలదీస్తానని రాహుల్ చెప్పారు. ఇదిలాఉండగా, ఇప్పటిదాకా ఎంఐఎంతో పరస్పర అవగాహనతో పనిచేసినా, భవిష్యత్తులో అమీతుమీ తేల్చుకోవాలని టీపీసీసీ నేతలకు రాహుల్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కేడర్ విస్తరణపై దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా రాహుల్ టీపీసీసీ నేతలకు సూచించారు.
పాతబస్తీలో రాహుల్ సద్భావనా యాత్ర
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు మొదటివారంలో ‘సద్భావనా పాదయాత్ర’ పేరుతో దీనిని చేపట్టే అవకాశముంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముందు గా పాతబస్తీలో పర్యటించాలని నిర్ణయించారు.
రాహుల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీలు దిగ్విజయ్‌సింగ్, ఆర్.సి.కుంతియాతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీనేత కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. కాగా, హైదరాబాద్, వరంగల్‌లో వరుసగా పాదయాత్ర నిర్వహిస్తే బాగుంటుందా లేక రెండు వేర్వేరు తేదీల్లో విడతల వారీగా యాత్ర చేస్తే బాగుంటుందా అనే విషయంపై టీపీసీసీని నివేదిక ఇవ్వాలని రాహుల్‌గాంధీ ఆదేశించినట్టు తెలిసింది.