రాష్ట్రం.. దేశంలో నంబర్ వన్ అవుతుంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ముఖ్యమంత్రి కే సీఆర్ ముందుకు వెళుతున్నారని, ఆయన వద్ద అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని, అవి సాకారమైతే వచ్చే పదేళ్లలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ అవుతుందని టీఆర్‌ఎస్ నేత డి.శ్రీనివాస్ జోస్యం చెప్పారు. డీఎస్ తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ బుధవారం తన ఇంటికి వచ్చి సుమారు గంటన్నర సేపు గడిపారని, ఆ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన ఆలోచనలు పంచుకున్నారని చెప్పారు.
సీఎంతో మాట్లాడాక తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని, ఏ కారణాలతో తాను టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నానో అది సరైనదేనని భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం వద్ద ఉన్న రోడ్ మ్యాప్, ప్రణాళికలను అమలు చేసేందుకు, లక్ష్యాలను సాధించేందుకు తగిన వనరులు కూడా అవసరమని, పాలకపక్షానికి అన్ని రాజకీయ పక్షాల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. కానీ, రాష్ట్రంలో ప్రతిపక్షాలు కేవలం పాలకపక్షాన్ని వ్యతిరేకించడానికే అన్నట్లు ఉన్నాయన్నారు.
‘రాష్ట్రం ఏడాది పసిగుడ్డు. సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో నేను భాగస్వామిని కావాలనుకుంటున్నా, నన్ను ఎలా ఇన్వాల్వు చేస్తారో సీఎం ఇష్టం. ఈ లక్ష్య సాధనలో నా సేవలు ఉపయోగపడితే చాలు. పట్టుదల, చిత్తశుద్ధి ఉన్న నేత కేసీఆర్..’ అని డీఎస్ వివరించారు.
చంద్రబాబువి బజారు మాటలు...
‘ఏపీ సీఎం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి, ఇక్కడి వారు 12 గంటలకు లేస్తారని అంటే ఏమనుకోవాలి. ఆయనవి బజారు మాటలు. బాబు.. ఇక్కడి నుంచి తొందగా వె ళ్లిపో’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజల ఆత్మ విశ్వాసం పెంచేలా ఏపీ సీఎం, ఆయన మంత్రులు పనిచేయడం లేదని, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. సెక్షన్-8 పేర ఇక్కడ ఇబ్బందులు పెట్టాలని చూశారని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలోనే లోపం ఉందని డీఎస్ అభిప్రాయపడ్డారు.