సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం నిలిచిపోయిన ప్రక్రియను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొనసాగిస్తామని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ గడువు పొడిగించాలన్న తమ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, కాబట్టి ఆ ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో కోర్టు ధిక్కారం అవుతుందని పేర్కొంది. అందువల్ల 2014, 2015 నోటిఫికేషన్ల ఆధారంగా జరిగిన జేసీజే రెండు స్క్రీనింగ్ టెస్ట్‌లకు సంబంధించిన సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయడంతోపాటు రాతపరీక్ష, ఇంటర్వ్యూల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది.
అవసరమైన పక్షంలో ఇంటర్వ్యూల వరకే ప్రక్రియను పూర్తి చేసి ఇందుకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉండేలా చూస్తామని వివరించింది. దీనిపై బుధవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. అంతకుముందు దీనిపై ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె. రామకృష్ణారెడ్డి అభిప్రాయం కోరగా ఈ ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జేసీజే పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు. గతేడాది జూన్ 2 నుంచి తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్ అమల్లోకి వచ్చాయని, దీని ప్రకారమే పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా హైకోర్టు, 2014, 2015లలో ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారమే జేసీజే పరీక్షలు నిర్వహించిందని, ఈ పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించబోదని ఏజీ చెప్పారు.
అధికరణ 233, 234 ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నియామకపు ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. హైకోర్టు కేవలం నియామకపు ప్రక్రియను పర్యవేక్షించే ఏజెన్సీ మాత్రమేనని, కాబట్టి ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్ ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. కింది స్థాయి న్యాయవ్యవస్థను విభజించేంత వరకు న్యాయాధికారుల పోస్టులను భర్తీ చేయవద్దని, జేసీజే పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లను కొట్టేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ఇటీవల విచారించిన హైకోర్టు ధర్మాసనం...
జేసీజే పరీక్ష నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా సీల్డ్‌కవర్‌లో భద్రపరచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు రాగా ప్రధాన వ్యాజ్యాలను ఇప్పుడు విచారించడం సాధ్యం కాదని, అనుబంధ పిటిషన్లపై విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.
జేసీజే పోస్టుల భర్తీ కొనసాగిస్తాం
Published Tue, Jul 28 2015 1:42 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
Advertisement