Junior Civil Judge
-
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన న్యాయమూర్తి
సింగరేణి (కొత్తగూడెం): నల్లగొండ జిల్లా మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న ఆదివారం రాత్రి కొత్తగూడెం ప్రభ ుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. కొత్తగూడెంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన న్యాయవాది శాంత కుమార్తె అయిన స్వప్నకు మిర్యాలగూడ మండలం నిడమనూరుకు చెందిన దాసరి కార్తీక్‌తో వివాహం జరిగింది.ప్రస్తుతం నల్లగొండ జిల్లా మున్సిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న స్వప్న.. ప్రసవం కోసం కొత్తగూడెంలోని పుట్టింటికి వచ్చారు. ఉన్నత విద్యనభ్యసించి, న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆమె.. కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నా సామాన్య ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేరగా ఆదివారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకోవాలని, పూర్తి నమ్మకంతో వైద్యం పొందాలని సూచించారు. తనకు వైద్యసేవలందించిన డాక్టర్ సాగరిక, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
బెడిసికొట్టిన జడ్జి రామకృష్ణ దాడి నాటకం
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోటకు చెందిన సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్. రామకృష్ణ ఇంటిపై దాడి ఘటన ఓ నాటకంగా తేలిపోయింది. దాడిచేసి ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టింది స్వయానా జడ్జి తమ్ముడు రామచంద్ర అని విచారణలో నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో నాటకానికి తెరపడింది. సోదరుల మధ్య కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలను కూడా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లెలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని అర్థమైంది.గతంలోనూ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం లేని వివాదంలోకి లాగడం కూడా ఇలాంటిదేనని స్పష్టమైంది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులో నిందితుడు అతని తమ్ముడేనని తేల్చి ఈ మేరకు అరెస్ట్ చేసి 41 నోటీసు జారీ చేశామని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. గతనెల 30న రాత్రి బి.కొత్తకోట కరెంట్ కాలనీలో ఉంటున్న రామకృష్ణ ఇంటివద్దకు వచ్చిన తమ్ముడు రామచంద్ర ఆస్తి పంపకాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు, ఇంటిలో నుంచి రామకృష్ణ వెలుపలికి రాకపోవడంతో అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటుకు కొట్టడంతో రామకృష్ణ బయటకు రాగా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న గొడవతో రామచంద్ర కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు తనను హతమార్చేందుకు దాడిచేశారని ఈనెల ఒకటిన రామకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పరిసరాల్లో జరిపిన విచారణలో రామచంద్రే ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడైన రామచంద్రను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. రామచంద్రపై బి.కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. -
కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్ సివిల్ జడ్జి
కొంత మంది ఆదర్శాలు వల్లిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆదర్శాలను ఆచరించి చూపిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి. తమ గారాలపట్టిని సర్కారుబడిలో చేర్చి శభాష్ అనిపించుకున్నారు. ఖలీల్‌వాడి : నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్, ప్రియాంక జాదవ్ దంపతులు తమ అయిదేళ్ల కుమార్తె అంబికా జాదవ్‌ను చంద్రశేఖర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో బుధవారం చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో తమ సంతానాన్ని చేర్పిస్తే స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. (క్లిక్: నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!) -
కోచింగ్ తీసుకుని జడ్జి అయిపోవచ్చా!
సాక్షి, అమరావతి: ‘న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వారు న్యాయవాదిగా అనుభవం సాధించకుండా.. ఓ మూడు నెలలు కోచింగ్ సెంటర్ కెళ్లి కోచింగ్ తీసుకుని.. పరీక్ష రాసి జూనియర్ సివిల్ జడ్జి అయితే సరిపోతుందా. కోచింగ్ సెంటర్లలో కోర్టు విధులను ఎలా నిర్వహిస్తారో నేర్పిస్తారా?. న్యాయవాదిగా కనీస అనుభవం లేకుండా జూనియర్ సివిల్ జడ్జి అయితే వారు న్యాయవ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లగలరు?. కోర్టు కార్యకలాపాలను ఎలా నిర్వహించాలో తెలియని వారు జూనియర్ సివిల్ జడ్జిలు అయితే వ్యవస్థ పరిస్థితి ఏమిటి?. ఇటువంటి విధానాన్ని మనం అనుమతిద్దామా?. జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలన్న నిబంధనను ఐదేళ్లకు మార్చాల్సిన అవసరం ఉంది’ అని ఏపీ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు గత నెల 17న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు భర్తీ చేసుకునే అభ్యర్థి కనీసం మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలనే నిబంధన విధించింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన యు.సురేఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మటం వెంకటరమణతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ వదేరా వాదనలు వినిపిస్తూ.. జేసీజే పోస్టుకు మూడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టుతో పాటు పలు హైకోర్టులు తీర్పులిచ్చాయని తెలిపారు. గతంలో ఉమ్మడి హైకోర్టు కూడా ఇదే చెప్పిందన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘ఢిల్లీ, బాంబే తదితర చోట్ల జేసీజే పోస్టుల భర్తీకి పెద్దగా స్పందన రాకపోవడం వల్ల మూడేళ్ల ప్రాక్టీస్ నిబంధనను సడలించి ఉండొచ్చు. వాస్తవానికి కనీస ప్రాక్టీస్ మూడేళ్లు కాదు.. ఐదేళ్లు ఉండాలి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తే వ్యవస్థ పనితీరు తెలుస్తుంది. కోర్టు కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో తెలుస్తాయి. సీనియర్లు ఎలా వాదనలు వినిపిస్తున్నారు, జడ్జీలు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు, తీర్పులు ఎలా ఇస్తున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రాక్టీస్ చేయకుండా నేరుగా కోచింగ్ సెంటర్‌కు వెళ్లి కోచింగ్ తీసుకుని పరీక్ష రాసి జూనియర్ సివిల్ జడ్జి అయిపోతే ప్రయోజనం ఏముంది? దీని వల్ల వ్యవస్థకు ఏం లాభం?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మూడేళ్ల నిబంధనపై హైకోర్టు వైఖరి ఏమిటో తెలుసుకుంటామంటూ విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున హైకోర్టు తరఫు న్యాయవాది తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది. -
నాన్న ప్రోత్సాహంతోనే..
మెదక్‌జోన్: ‘ఆడపిల్లవు నీకెందుకు ఉన్నత చదువులు అని మేనత్తలు, బంధువులు వారించినా.. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని ఆడ, మగ చదవాల్సిందే అని నాన్న ప్రోత్సహించారు. ఆయన ప్రోత్భలంతోనే నేడు న్యాయమూర్తిగా రాణిస్తున్నా.’ అని మెదక్ జూనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ తెలిపారు. ఆమె మాటల్లోనే మరిన్ని వివరాలు.. మేము ఐదుగురు సంతానం మాది హైదరాబాద్. తండ్రి రజాక్, తల్లి సిరాజ్ నస్రీన్. మేము ఐదుగురు సంతానం. వీరిలో నలుగురుం ఆడపిల్లలం. మాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అందులో నేను మూడో సంతానం. అమ్మ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నాన్న లా చదివి వ్యాపారంలో స్థిరపడ్డారు. మా ఐదుగురినీ ఉన్నత చదువులు చదివించారు. నా డిగ్రీ పూర్తి అయిన తర్వాత లా చదివే సమయంలో.. ‘ఆడపిల్లకు ఉన్నత చదువులు ఎందుకు.. చదువు మాన్పించు..’ అంటూ మా మేనత్త, బంధువులు నాన్నకు చెప్పారు. కానీ, నాన్న మాత్రం చదువుతోనే వాళ్లు సొంతంగా నిలబడతారని చెప్పారు. దీంతో నేను లండన్‌లో ఎల్.ఎల్.ఎం. పూర్తి చేశా. తర్వాత మొదటిసారి పరీక్ష రాసి జడ్జీగా ఎంపికయ్యా. ఇల్లాలికి చదువు చాలా అవసరం ప్రతి ఇల్లాలికి చదువు రావాలి. పిల్లలను పెంచడంలో తండ్రి కన్నా తల్లి పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఆ తల్లికి చదువు వస్తే పిల్లల భవిష్యత్తు మరింత తీర్చిదిద్దవచ్చు. కుటుంబ బాధ్యతలు సైతం సక్రమంగా నిర్వహించే వీలుంటుంది. ప్రస్తుతం ఆడపిల్లలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. చదువుతోనే విజ్ఞానం పెరుగుతుంది.. అంతేకాదు తమ హక్కుల గురించి మహిళలు తెలుసుకునే వీలుంటుంది. చదువంటే ఉద్యోగం కాదు ఉన్నత చదువులు అనగానే కొందరు తల్లిదండ్రులకు మంచి ఉద్యోగం వస్తుంది అని ఆలోచిస్తారు. కానీ, చదువంటే ఉద్యోగం కాదు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం. విజ్ఞానం పెరిగితే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. మంచి ఉద్యోగం సాధించేలా మాత్రమే చదివించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు. చట్టాలపై అవగాహన అవసరం మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం. విడాకులు, మెయింటనెన్స్, వరకట్న వేధింపులు, గృహహింస లాంటి కేసుల్లో మహిళలు అధికంగా కోర్టుకు వస్తున్నారు. కానీ, కోర్టుకు వచ్చే మహిళల్లో 90 శాతం మందికి చట్టాలపై అసలు అవగాహన లేదు. కొన్ని సందర్భాల్లో ఈ విషయం నన్ను చాలా బాధిస్తుంది. మహిళలకు చట్టాల మీద అవగాహన కలగాలంటే చదువే ఏకైక మార్గం. వృత్తిలో సంతోషం నాన్న ఎంతో ఇష్టంతో లండన్‌లో నన్ను ఎల్.ఎల్.ఎం. చదివించారు. ఆ తర్వాత మొదటి పరీక్షలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యా. సుమారు 18 నెలలుగా న్యాయమూర్తి వృత్తిలో కొనసాగుతున్నా. పట్టుదలతో ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఉన్నత శిఖరాలు చేరడం కష్టమేమీ కాదు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి. -
జూనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో పనిచేస్తున్న పలువురు జూనియర్ సివిల్ జడ్జిలకు సీనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో 29 మంది జూనియర్ సివిల్ జడ్జిలు ఉన్నారు. 23 జూనియర్ సివిల్ జడ్జిల పోస్టులకు ఉమ్మడి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 19 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 4 పోస్టులను రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 28 తరువాత హైకోర్టు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. -
ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా రామచంద్రుడు
అనంతపురం లీగల్ : హైకోర్టు ఉత్తర్వుల మేరకు అనంతపురం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా టి.రామచంద్రుడు, అబ్కారీ కేసుల ప్రత్యేక మేజిస్ట్రేటుగా బుజ్జప్ప భాధ్యతలు చేపట్టారు. కడప జిల్లాకు చెందిన రామచంద్రుడు గతంలో ధర్మవరం మేజిస్ట్రేటుగా,కర్నూలు జూనియర్ సివిల్ జడ్జిగా భాధ్యతలు నిర్వర్తించారు. అనంతపురం జ్యుడిషియల్ ఫస్టుక్లాసు మేజిస్ట్రేటుగా, జువెనైల్ జస్టిస్‌బోర్డు అధ్యక్షుడిగా బుజ్జప్ప పనిచేశారు. -
జేసీజేల నియామకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జీ(జేసీజే)ల నియామకానికి ఎట్టకేలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూనియర్ సివిల్ జడ్జీ పోస్టుల భర్తీ కోసం త్వరలో జరగనున్న స్క్రీనింగ్ టెస్ట్‌లను షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకునేందుకు హైకోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. 150 జడ్జీల పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
జేసీజే పోస్టుల భర్తీ కొనసాగిస్తాం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం నిలిచిపోయిన ప్రక్రియను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొనసాగిస్తామని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ గడువు పొడిగించాలన్న తమ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, కాబట్టి ఆ ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో కోర్టు ధిక్కారం అవుతుందని పేర్కొంది. అందువల్ల 2014, 2015 నోటిఫికేషన్ల ఆధారంగా జరిగిన జేసీజే రెండు స్క్రీనింగ్ టెస్ట్‌లకు సంబంధించిన సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయడంతోపాటు రాతపరీక్ష, ఇంటర్వ్యూల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది. అవసరమైన పక్షంలో ఇంటర్వ్యూల వరకే ప్రక్రియను పూర్తి చేసి ఇందుకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉండేలా చూస్తామని వివరించింది. దీనిపై బుధవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. అంతకుముందు దీనిపై ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె. రామకృష్ణారెడ్డి అభిప్రాయం కోరగా ఈ ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జేసీజే పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు. గతేడాది జూన్ 2 నుంచి తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్ అమల్లోకి వచ్చాయని, దీని ప్రకారమే పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా హైకోర్టు, 2014, 2015లలో ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారమే జేసీజే పరీక్షలు నిర్వహించిందని, ఈ పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించబోదని ఏజీ చెప్పారు. అధికరణ 233, 234 ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నియామకపు ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. హైకోర్టు కేవలం నియామకపు ప్రక్రియను పర్యవేక్షించే ఏజెన్సీ మాత్రమేనని, కాబట్టి ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్ ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. కింది స్థాయి న్యాయవ్యవస్థను విభజించేంత వరకు న్యాయాధికారుల పోస్టులను భర్తీ చేయవద్దని, జేసీజే పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లను కొట్టేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ఇటీవల విచారించిన హైకోర్టు ధర్మాసనం... జేసీజే పరీక్ష నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా సీల్డ్కవర్లో భద్రపరచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు రాగా ప్రధాన వ్యాజ్యాలను ఇప్పుడు విచారించడం సాధ్యం కాదని, అనుబంధ పిటిషన్లపై విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. -
జేసీజే, డీజే పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జీ (జేసీజే), జిల్లా జడ్జీ (డీజే) పోస్టుల భర్తీ కోసం త్వరలో జరగనున్న స్క్రీనింగ్ టెస్ట్‌లను షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకునేందుకు హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. పరీక్షల అనంతరం సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా వాటిని తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు సీల్డ్ కవర్లో భద్రపరచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అన్ని పక్షాల తరఫు న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది. రాష్ట్ర విభజన తరువాత జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి వచ్చే నెల 12న స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది. అలాగే జిల్లా జడ్జీ పోస్టుల భర్తీకి ఈ నెల 28న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల నిర్వహణను నిలిపేయాలంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన జరిగేంత వరకు పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలను గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డుకోవద్దని పిటిషనర్లకు విజ్ఞప్తి చేసింది. ‘ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే 164 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. 20 శాతం కోర్టులు న్యాయాధికారులు లేక ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. దీని వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరు. ప్రజలు, కక్షిదారులే. ఈ పిటిషన్లు దాఖలు చేయడాన్ని మేం తప్పుపట్టడం లేదు. ఎక్కడో ఓ చోట ప్రారంభం కావాలి కాబట్టి పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగిద్దాం. ఇన్ని పోస్టులు భర్తీకి నోచుకోవడం పట్ల యువ న్యాయవాదులు సంతోషంగా ఉన్నారు. వారు సీరియస్‌గా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వారి జీవిత కాలంలో ఒకసారి వచ్చే గొప్ప అవకాశం ఇది. ఈ పరీక్షకు తెలంగాణకు చెందిన న్యాయవాదులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి మాకు సాయం చేసే చేతులు కొన్ని కావాలి. పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థుల సహనాన్ని మేం పరీక్షించదలచుకోలేదు.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ జుడీషియల్ సర్వీస్ రూల్స్ 2007ను తాము తమ రాష్ట్రానికి వర్తింప చేసుకున్నామని, విజభన తరువాత పోస్టుల భర్తీని తమ రాష్ట్ర రూల్స్ ప్రకారం చేపట్టాలని ఆయన కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, గతంలో జేసీజే పరీక్షలు జరిగినప్పుడు ఈ హైకోర్టు ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో అవే ఉత్తర్వులను ఇప్పుడు కూడా జారీ చేస్తామని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు అనుమతినిస్తూ, సమాధానపత్రాలను మాత్రం మూల్యంకనం చేయకుండా సీల్డ్ కవర్లో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
సీఐ, ఎస్ఐలకు రెండేళ్ల జైలుశిక్ష
పొన్నూరురూరల్: పొన్నూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 2006లో సీఐ, ఎస్ఐలుగా పనిచేసిన శివరామరాజు, మోజస్‌పాల్‌లకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.రవి మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. పొన్నూరు మండలం ములుకుదురు గ్రా మానికి చెందిన విశ్రాంత తహశీల్దార్ ముసులూరి సత్యనారాయణకు చెందిన 3.63 ఎకరాల మాగాణిలో వరికుప్పను అదే గ్రామానికి చెందిన కొందరు అక్రమంగా నూర్చేసి ధాన్యాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన పొన్నూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ నిందితులకు పోలీసులు కొమ్ముకాసి కేసును నీరుగార్చడంతో లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త విచారణ అనంతరం సంబంధిత పోలీసు అధికారులపై చర్య లు తీసుకోవాలని తీర్పునిచ్చింది. ఇదే కేసుపై 2008లో సత్యనారాయణ పొన్నూరు కోర్టులో అప్పటి బాపట్ల డీఎస్పీ అబ్దుల్ రషీద్, రూరల్ సీఐ శివరామరాజు, ఎస్ఐలు మోజస్‌పాల్, రవికుమార్‌లపై ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం అప్పటి సీఐ శివరామరాజు, ఎస్ఐ మోజస్పాల్లను నిందితులుగా పేర్కొంటూ వారిద్దరికీ రెండేసి సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తూ జడ్జి కె.రవి తీర్పునిచ్చారు. అప్పటి బాపట్ల డీఎస్పీ అబ్దుల్ రషీద్ ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల ఆయనపై కేసు పెండింగ్‌లో ఉంది. రూరల్ ఎస్ఐ రవికుమార్‌పై ఆరోపణలు రుజువుకాక ఆయనపై కేసును కొట్టివేశారు. సీఐ శివరామరాజు కొంతకాలం జిల్లాలో డీఎస్పీగా పనిచేసి పదవీ విరమణ పొందగా, మోజస్‌పాల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో సీబీసీఐడీ విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. ఈ కేసులో తెనాలికి చెందిన న్యాయవాది జి.ఎస్ నాగేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. -
కోర్టుకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే
ఎమ్మిగనూరు టౌన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బి.వి.జయనాగేశ్వరరెడ్డి సోమవారం ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. గత మార్చి 30న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ఆదిఆంధ్ర పాఠశాలలోని పోలింగ్ బూత్‌కు సమీపంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లతో చర్చిస్తుండటంతో పట్టణ పోలీసులు ఆయనపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. సోమవారం ఈ కేసు వాయిదా ఉండటంతో ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్ ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేశారు. -
జేసీజే పోస్టుల భర్తీపై జోక్యం చేసుకోలేం
పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు ‘సుప్రీం’ను ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అందువల్ల ప్రస్తుతం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో జూన్ 2న రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు జేసీజే పోస్టులను భర్తీ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. 97 జేసీజే పోస్టుల భర్తీ నిమిత్తం హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాది జి.సంతోష్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, జూన్ 2న రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని, ఈ సమయంలో పోస్టులు భర్తీ చేయడం సరికాదని నివేదించారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి అడ్డుతగులుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తాము ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టామని స్పష్టం చేశారు. జేసీజే పోస్టుల భర్తీ విషయంలో తమ పనిని చేసుకోనివ్వాలని, 58:42 నిష్పత్తిలో సీమాంధ్ర, తెలంగాణల మధ్య పోస్టుల కేటాయింపు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ సమయంలో సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ, జేసీజే పోస్టుల్లో సీమాంధ్రులు ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నారన్నారు. అయితే అవన్నీ ఇప్పుడు చెప్పొద్దని, తమ బాధ్యత తమకు తెలుసునని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారం పోస్టుల భర్తీ చేపట్టామని తెలిపారు. ఈ పిటిషన్ దాఖలు చేసే న్యాయపరమైన హక్కు పిటిషనర్‌కు లేదని చెప్పారు. -
జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష
గుంటూరు లీగల్, న్యూస్‌లైన్,గుంటూరు బార్ అసోసియేషన్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) సంయుక్త ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష శుక్రవారం ఉదయం గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరీక్ష పత్రాలను రెండో అదనపు జిల్లా జడ్జి వి.నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైతే సమాజానికి తమవంతు సహాయ సహకారాలు అందించవచ్చని తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు మోడల్ పరీక్ష నిర్వహించేందుకు తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐలు జిల్లా కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష నిర్వహించే వరకు ప్రతి శని, ఆదివారాలు సెలవు దినాల్లో జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శిక్షణ తరగతులు కొనసాగిస్తామని తెలిపారు. మోడల్ టెస్ట్‌లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురికి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.భాస్కరరావు బహుమతులు అందజేశారు. అనంతరం అభ్యర్థులకు న్యాయమూర్తి భాస్కరరావు కాంట్రాక్ట్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే అంశాలపై తరగతులు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఐలు జిల్లా అధ్యక్షుడు కట్టా కాళిదాసు, బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి ఏపీ లాలి పర్యవేక్షించారు.