కోచింగ్‌ తీసుకుని జడ్జి అయిపోవచ్చా! | AP High Court made strong comments On Civil Judge Posts | Sakshi
Sakshi News home page

కోచింగ్‌ తీసుకుని జడ్జి అయిపోవచ్చా!

Published Sat, Jul 6 2019 12:07 PM | Last Updated on Sat, Jul 6 2019 12:08 PM

AP High Court made strong comments On Civil Judge Posts - Sakshi

సాక్షి, అమరావతి: ‘న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వారు న్యాయవాదిగా అనుభవం సాధించకుండా.. ఓ మూడు నెలలు కోచింగ్‌ సెంటర్‌ కెళ్లి కోచింగ్‌ తీసుకుని.. పరీక్ష రాసి జూనియర్‌ సివిల్‌ జడ్జి అయితే సరిపోతుందా. కోచింగ్‌ సెంటర్లలో కోర్టు విధులను ఎలా నిర్వహిస్తారో నేర్పిస్తారా?. న్యాయవాదిగా కనీస అనుభవం లేకుండా జూనియర్‌ సివిల్‌ జడ్జి అయితే వారు న్యాయవ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లగలరు?. కోర్టు కార్యకలాపాలను ఎలా నిర్వహించాలో తెలియని వారు జూనియర్‌ సివిల్‌ జడ్జిలు అయితే వ్యవస్థ పరిస్థితి ఏమిటి?. ఇటువంటి విధానాన్ని మనం అనుమతిద్దామా?. జూనియర్‌ సివిల్‌ జడ్జి (జేసీజే) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసి ఉండాలన్న నిబంధనను ఐదేళ్లకు మార్చాల్సిన అవసరం ఉంది’ అని ఏపీ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

జూనియర్‌ సివిల్‌ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు గత నెల 17న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులకు భర్తీ చేసుకునే అభ్యర్థి కనీసం మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసి ఉండాలనే నిబంధన విధించింది. ఈ నిబంధనను సవాల్‌ చేస్తూ కర్నూలుకు చెందిన యు.సురేఖ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మటం వెంకటరమణతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది బాలాజీ వదేరా వాదనలు వినిపిస్తూ.. జేసీజే పోస్టుకు మూడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టుతో పాటు పలు హైకోర్టులు తీర్పులిచ్చాయని తెలిపారు. గతంలో ఉమ్మడి హైకోర్టు కూడా ఇదే చెప్పిందన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. 

‘ఢిల్లీ, బాంబే తదితర చోట్ల జేసీజే పోస్టుల భర్తీకి పెద్దగా స్పందన రాకపోవడం వల్ల మూడేళ్ల ప్రాక్టీస్‌ నిబంధనను సడలించి ఉండొచ్చు. వాస్తవానికి కనీస ప్రాక్టీస్‌ మూడేళ్లు కాదు.. ఐదేళ్లు ఉండాలి. న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తే వ్యవస్థ పనితీరు తెలుస్తుంది. కోర్టు కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో తెలుస్తాయి. సీనియర్లు ఎలా వాదనలు వినిపిస్తున్నారు, జడ్జీలు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు, తీర్పులు ఎలా ఇస్తున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రాక్టీస్‌ చేయకుండా నేరుగా కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లి కోచింగ్‌ తీసుకుని పరీక్ష రాసి జూనియర్‌ సివిల్‌ జడ్జి అయిపోతే ప్రయోజనం ఏముంది? దీని వల్ల వ్యవస్థకు ఏం లాభం?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మూడేళ్ల నిబంధనపై హైకోర్టు వైఖరి ఏమిటో తెలుసుకుంటామంటూ విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున హైకోర్టు తరఫు న్యాయవాది తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement