సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జీ (జేసీజే), జిల్లా జడ్జీ (డీజే) పోస్టుల భర్తీ కోసం త్వరలో జరగనున్న స్క్రీనింగ్ టెస్ట్‌లను షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకునేందుకు హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. పరీక్షల అనంతరం సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా వాటిని తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు సీల్డ్ కవర్‌లో భద్రపరచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అన్ని పక్షాల తరఫు న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది. రాష్ట్ర విభజన తరువాత జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి వచ్చే నెల 12న స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది. అలాగే జిల్లా జడ్జీ పోస్టుల భర్తీకి ఈ నెల 28న పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ రెండు పరీక్షల నిర్వహణను నిలిపేయాలంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన జరిగేంత వరకు పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలను గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డుకోవద్దని పిటిషనర్లకు విజ్ఞప్తి చేసింది. ‘ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే 164 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. 20 శాతం కోర్టులు న్యాయాధికారులు లేక ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. దీని వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరు. ప్రజలు, కక్షిదారులే. ఈ పిటిషన్లు దాఖలు చేయడాన్ని మేం తప్పుపట్టడం లేదు. ఎక్కడో ఓ చోట ప్రారంభం కావాలి కాబట్టి పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగిద్దాం.
ఇన్ని పోస్టులు భర్తీకి నోచుకోవడం పట్ల యువ న్యాయవాదులు సంతోషంగా ఉన్నారు. వారు సీరియస్‌గా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వారి జీవిత కాలంలో ఒకసారి వచ్చే గొప్ప అవకాశం ఇది. ఈ పరీక్షకు తెలంగాణకు చెందిన న్యాయవాదులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి మాకు సాయం చేసే చేతులు కొన్ని కావాలి. పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థుల సహనాన్ని మేం పరీక్షించదలచుకోలేదు.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ జుడీషియల్ సర్వీస్ రూల్స్ 2007ను తాము తమ రాష్ట్రానికి వర్తింప చేసుకున్నామని, విజభన తరువాత పోస్టుల భర్తీని తమ రాష్ట్ర రూల్స్ ప్రకారం చేపట్టాలని ఆయన కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, గతంలో జేసీజే పరీక్షలు జరిగినప్పుడు ఈ హైకోర్టు ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో అవే ఉత్తర్వులను ఇప్పుడు కూడా జారీ చేస్తామని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు అనుమతినిస్తూ, సమాధానపత్రాలను మాత్రం మూల్యంకనం చేయకుండా సీల్డ్ కవర్‌లో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
జేసీజే, డీజే పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
Published Thu, Jun 25 2015 10:04 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement