పొన్నూరురూరల్: పొన్నూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 2006లో సీఐ, ఎస్‌ఐలుగా పనిచేసిన శివరామరాజు, మోజస్‌పాల్‌లకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.రవి మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. పొన్నూరు మండలం ములుకుదురు గ్రా మానికి చెందిన విశ్రాంత తహశీల్దార్ ముసులూరి సత్యనారాయణకు చెందిన 3.63 ఎకరాల మాగాణిలో వరికుప్పను అదే గ్రామానికి చెందిన కొందరు అక్రమంగా నూర్చేసి ధాన్యాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన పొన్నూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కానీ నిందితులకు పోలీసులు కొమ్ముకాసి కేసును నీరుగార్చడంతో లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త విచారణ అనంతరం సంబంధిత పోలీసు అధికారులపై చర్య లు తీసుకోవాలని తీర్పునిచ్చింది. ఇదే కేసుపై 2008లో సత్యనారాయణ పొన్నూరు కోర్టులో అప్పటి బాపట్ల డీఎస్పీ అబ్దుల్ రషీద్, రూరల్ సీఐ శివరామరాజు, ఎస్‌ఐలు మోజస్‌పాల్, రవికుమార్లపై ప్రైవేటు కేసు దాఖలు చేశారు.
కేసు విచారణ అనంతరం అప్పటి సీఐ శివరామరాజు, ఎస్‌ఐ మోజస్‌పాల్‌లను నిందితులుగా పేర్కొంటూ వారిద్దరికీ రెండేసి సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తూ జడ్జి కె.రవి తీర్పునిచ్చారు. అప్పటి బాపట్ల డీఎస్పీ అబ్దుల్ రషీద్ ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల ఆయనపై కేసు పెండింగ్‌లో ఉంది. రూరల్ ఎస్‌ఐ రవికుమార్‌పై ఆరోపణలు రుజువుకాక ఆయనపై కేసును కొట్టివేశారు. సీఐ శివరామరాజు కొంతకాలం జిల్లాలో డీఎస్పీగా పనిచేసి పదవీ విరమణ పొందగా, మోజస్‌పాల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో సీబీసీఐడీ విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. ఈ కేసులో తెనాలికి చెందిన న్యాయవాది జి.ఎస్ నాగేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు.
సీఐ, ఎస్‌ఐలకు రెండేళ్ల జైలుశిక్ష
Published Wed, Aug 13 2014 2:07 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
Advertisement
Advertisement