జేసీజే పోస్టుల భర్తీపై జోక్యం చేసుకోలేం | jcj can not iinterfere with | Sakshi
Sakshi News home page

జేసీజే పోస్టుల భర్తీపై జోక్యం చేసుకోలేం

Published Wed, Apr 23 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

jcj can not iinterfere with

పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
‘సుప్రీం’ను ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ

 
హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అందువల్ల ప్రస్తుతం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో జూన్ 2న రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు జేసీజే పోస్టులను భర్తీ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. 97 జేసీజే పోస్టుల భర్తీ నిమిత్తం హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాది జి.సంతోష్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, జూన్ 2న రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని, ఈ సమయంలో పోస్టులు భర్తీ చేయడం సరికాదని నివేదించారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి అడ్డుతగులుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తాము ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టామని స్పష్టం చేశారు. జేసీజే పోస్టుల భర్తీ విషయంలో తమ పనిని చేసుకోనివ్వాలని, 58:42 నిష్పత్తిలో సీమాంధ్ర, తెలంగాణల మధ్య పోస్టుల కేటాయింపు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ సమయంలో సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ, జేసీజే పోస్టుల్లో సీమాంధ్రులు ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నారన్నారు. అయితే అవన్నీ ఇప్పుడు చెప్పొద్దని, తమ బాధ్యత తమకు తెలుసునని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారం పోస్టుల భర్తీ చేపట్టామని తెలిపారు. ఈ పిటిషన్ దాఖలు చేసే న్యాయపరమైన హక్కు పిటిషనర్‌కు లేదని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement