
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ వేడుకను నిర్వహిస్తున్నట్లు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. మహా బతుకమ్మ గిన్నిస్ రికార్డ్స్ పరీక్ష గురువారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో 300 మంది టీం లీడర్లకు శిక్షణ ఇచ్చారు. వారికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ నియమనిబంధనలు వివరించారు.
హరికృష్ణ మాట్లాడుతూ ఈ పరీక్షలో భాగంగా మహిళలు తంగేడుపువ్వు ఆకృతిలో రూపొందటం, బతుకమ్మ పూలతో తివాచి ఏర్పర్చడం ఉంటుందని తెలిపారు. ఒక అడుగు బతుకమ్మను 3 వేలమంది మహిళలు ఒకేసారి పూలతో తయారు చేస్తూ బతుకమ్మ విశిష్టతను తెలియజేస్తారని వివరించారు. మూడు వేల మందికి చీరలు పంపిణీ చేస్తామన్నారు. తంగేడు ఆకృతికి సంబంధించి పువ్వు ఉన్న పసుపు ఆకారం భాగంలో పసుపు చీరలు ధరించిన మహిళలు నిలబడతారని చెప్పారు.
కాండం భాగంలో ఆకుపచ్చ చీరలు ధరించిన మహిళలు పాల్గొంటారని తెలిపారు. ఈ మొత్తం ఈవెంట్‌కు సంబంధించిన ప్లాన్‌ను చిత్రపటం రూపంలో తయారు చేశామని, దాన్ని గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధికి చూపించామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఇందులో పాల్గొనే స్వయం సహాయక సంఘాల మహిళలందరూ ఉదయం 9 గంటలకు ఎల్‌బీ స్డేడియం చేరుకోవాలని తెలిపారు. ఒంటిగంట తర్వాత ఎల్‌బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు మూడు వేల బతుకమ్మలతో మహాప్రదర్శన సాగుతుందని, అనంతరం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తారన్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ ఈడీ మనోహర్, జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.