రూ.10 నాణేలు చెల్లుతాయి...
పుకార్లు నమ్మవద్దని బ్యాంకర్ల స్పష్టీకరణ
సిటీబ్యూరో: నగరంలో రూ.10 నాణేల చెలామణిపై కొందరిలో నెలకొన్న అనుమానాలను పలువురు బ్యాంకర్లు నివృత్తి చేశారు. ఇవి బహిరంగ మార్కెట్లు, బ్యాంకులు, ఇతర ఆర్థిక లావాదేవీల్లో నిర్భయంగా చెలామణి చేసుకోవచ్చని స్పష్టంచేశారు. రూ.10 కాయిన్ల చెలామణి, నకిలీ కాయిన్‌ల వెల్లువపై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించారు.
అయితే ఇటీవలికాలంలో పలు పెట్రోలుబంకుల యజమానులు, కిరాణా వర్తకులు ఈ కాయిన్‌లను స్వీకరించకపోవడం పట్ల పలువురు సిటీజనులు ఆందోళనతో బ్యాంకుల వద్దకు పరుగులుతీశారు. తమ వద్ద పోగుపడిన కాయిన్‌లను తమ అకౌంట్లలో జమచేసేందుకు పోటీపడడంతో గందరగోళం నెలకొంది. అయితే ఇవన్నీ పుకార్లేనని..ఈ కాయిన్‌ల చెలామణిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు.